కేసీఆర్‌.. మాదిగలను చిన్నచూపు చూస్తున్నారు

– ఎస్సీ వర్గీకరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ది లేదు
– టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోకు విలువలేదు
– నవంబర్‌ 6న ప్రజాగ్రహ సభ నిర్వహిస్తాం
– టీఆర్‌ఎస్‌, బీజేపీ మినహా అన్ని పార్టీల నేతలను పిలుస్తాం
– విలేకరుల సమావేశంలో ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ
హైదరాబాద్‌, సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి) : తెలంగాణ సీఎం కేసీఆర్‌ మాదిగల పట్ల చిన్నచూపు చూస్తున్నారని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. బుధవారం సోమాజీగూడ ప్రెస్‌ క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ ప్రభుత్వం తీరుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కేసీఆర్‌ ప్రభుత్వం మాదిగలను చిన్న చూపు చూస్తున్నదని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని వ్యాఖ్యానించారు. బీజేపీ జాతీయ నేతలు తెలంగాణకు ఎవరు వచ్చినా మా నిరసన తెలియజేస్తామని వెల్లడించారు. కేసీఆర్‌ నిండు సభలో ఇచ్చిన హావిూని నిలబెట్టుకోలేదని ధ్వజమెత్తారు. ఎమ్మార్పీఎస్‌ కార్యకర్త భారతి మాదిగ, హైదరాబాద్‌ కలెక్టరేట్‌ కార్యాలయం ముందు చనిపోయి 10నెలలు అయిందని, ఇప్పటి వరకు ఆమె కుటుంబానికి ఇస్తానన్న రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా మాట్లాడుతూ.. కేసీఆర్‌ అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకుపోతా అన్నారని, 10 నెలలు కావొస్తున్నా ఇప్పటి వరకూ ఊసే లేదన్నారు. కేసీఆర్‌ మాటాల మనిషి.. చేతల మనిషి కాదన్నారు. సామాజిక వర్గాల కోణంలో కేసీఆర్‌ ఇచ్చిన ఏ హావిూ నెరవేరలేదని మందకృష్ణ మాదిగ అన్నారు. పారిశుద్ధ్య కార్మికులను రెగ్యులర్‌ చేయాలని, మాదిగలు చేసే కులవృత్తుల్లో లెదర్‌ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం ఏంచేయలేదన్నారు. చెప్పులు కుట్టే కార్మికులకు పింఛన్‌ ఇచ్చారా? డప్పులు కొట్టే కార్మికులకు పింఛన్‌ ఇచ్చారా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ ప్రభుత్వంలో అవమానకరంగా భర్తరఫ్‌ చేసింది ఒక్క మాదిగ సామాజికవర్గానికి చెందిన రాజయ్యనే అన్నారు.  రామగుండం మేయర్‌ మాదిగ కాబట్టే కావాలని అతడిపై అవిశ్వాసం పెట్టారని, మాదిగ సామాజిక వర్గానికి స్థలం లేదు, భవనం లేదని, మాదిగ
వర్గంపై వివక్ష చూపెడుతున్నారని మందకృష్ణ విమర్శించారు. దళితులకు మూడెకరాల భూమి ఎక్కడ ఇచ్చారని ప్రశ్నించారు. మంత్రివర్గంలో మాదిగలకు నిజమైన ప్రాతినిథ్యం లేదన్నారు. టీఆర్‌ఎస్‌లో ఉన్న 16 మంది దళిత ఎమ్మెల్యేల్లో ఏ ఒక్కరికీ మంత్రి పదవి ఇవ్వలేదని, దళితులకు ఒక శాతం కూడా భూపంపిణీ జరగలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు పక్కదారి పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్‌ ఇచ్చారా అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోకు విలువ లేదని, కేసీఆర్‌ ప్రభుత్వంలో మహిళలకు స్థానం లేకుండా చేశారని మందకృష్ణ మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో మహిళలు పోరాడారని, వారిని ప్రభుత్వం గుర్తించడం లేదన్నారు. తెలంగాణ మహిళలకు అవమానం మిగిలిందని, .గౌరవం దక్కలేదని టీఆర్‌ఎస్‌ను, కేసీఆర్‌ను తీవ్రంగా దుయ్యబట్టారు. నవంబర్‌ 6న ప్రజాగ్రహ సభ ఉంటుందని, టీఆర్‌ఎస్‌, బీజేపీ మినహా అన్ని పార్టీలను ఆహ్వానిస్తామని ఈ సందర్భంగా మంద కృష్ణ తెలిపారు.