కోర్టు విధులను బహిష్కరించిన టీ లాయర్లు

హైదరాబాద్‌: తెలంగాణ అడ్వొకేట్‌ జేఏసీ ఆధ్వర్యంలో నిన్న చేపట్టిన ‘ చలో సంగారెడ్డి ‘ కార్యక్రమంలో తెలంగాణ న్యాయవాదులపై పోలీసులు లాఠీఛార్జీ చేయడాన్ని ఖండిస్తూ ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించారు. పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేశారు, తెలంగాణలోని ప్రతి కోర్టు ఎదుట న్యాయవాదులు సీమాంధ్ర ప్రభుత్వం దిష్టి బొమ్మలను దహనం చేశారు. తెలంగాణ నినాదాలు చేస్తూ వెంటనే కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.

లక్సెట్టిపేటలో న్యాయవాదుల ధర్నా

ఆదిలాబాద్‌ జిల్లా లక్సెట్టీపేటలో తెలంగాణ న్యాయవాదులు ధర్నాకు దిగారు. నిన్న సంగారెడ్డిలో న్యాయవాదులపై పోలీసులు రాక్షసత్వంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ కోర్టు ఎదుట బైఠాయించారు. పోలీసులపై తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ వ్యక్తం చేశారు.

నిజామాబాద్‌ల అడ్వొకేట్లూ విధుల బహిష్కరణ

నిజామాబాద్‌లోని కోర్టు కాంప్లెక్స్‌లో న్యాయవాదులు ఆందోళనను దిగారు. నిన్న సంగారెడ్డిలో తెలంగాణ న్యాయవాదులపై పోలీసులు లాఠీఛార్జి చేయడాన్ని ఖండిస్తూ వారు ధర్నా చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే తెలంగాణను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్‌ చేశారు.