కోస్తాలో పలుచోట్ల వానలు కురిసే అవకాశం
విశాఖపట్నం,నవంబర్21: వచ్చే 24 గంటల్లో కోస్తాంధ్రలో పలుచోట్ల వానలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం బుధవారం ఉదయం తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని, ఇది క్రమంగా పశ్చిమ నైరుతి దిశగా కదిలి, దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు వైపు పయనించే అవకాశం ఉంది. దీని ప్రభావం వల్ల కోస్తాంధ్రలో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా వానలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో ఒకటి రెండు చోట్ల ఓ మోస్తరునుంచి భారీ వానలు సైతం నమోదయ్యే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కి.విూ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. సముద్రంలోకి వెళ్లే మత్య్సకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. వాయుగుండం మరింత బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారిందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం అది మచిలీపట్నానికి తూర్పు ఆగ్నేయంగా 350 కి.విూ.ల దూరంలో ఉందని వెల్లడించారు. పశ్చిమ నైరుతి దిశగా కదులుతూ రాబోయే 48 గంటల్లో మరింత బలహీనపడి దక్షిణ కోస్తా తీరానికి సవిూపానికి చేరుకోవచ్చని వివరించారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి వరకు రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. తీరం పొడవునా గంటకు 40 నుంచి 50 కి.విూ.ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఒకటో నెంబరు ప్రమాద హెచ్చరికల్ని ఎత్తివేశామని, అయినప్పటికీ మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకపోవడం మంచిదని వివరించారు.



