గులాబీమయంగా మారిన తెలంగాణ పల్లెలు

అన్నిదారులూ కొంగరకలాన్‌ వైపే

గ్రామాల నుంచి బయలుదేరుతున్న వాహనాలు

నాలుగేళ్ల ప్రగతిని ప్రజల ముందుంచనున్న సిఎం కెసిఆర్‌

విపక్షాల విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పనున్న గులాబీనేత

ముందస్తు ఊహాగానాల నేపథ్యంలో విసరనున్న ఎన్నికల సవాల్‌

నేడు నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని వినతి

హైదరాబాద్‌,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి): ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో టిఆర్‌ఎస్‌ అధినేత,సిఎం కెసిఆర్‌ తలపెట్టిన అతిపెద్ద భారీ బహిరంగ సభ ప్రగతినివేదన సభకు సర్వం సిద్దమయ్యింది. టిఆర్‌ఎస్‌ చరిత్రలోనే ఇదో చారిత్రక ఘట్టంగా నిలిచిపోనుందని భావిస్తున్న తరుణంలో సభకు భారీగా ఏర్పాట్లు చేశారు. దాదాపు 25 లక్షల మందితో సత్తా చాటబోతున్నారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా పల్లె నుంచి పట్టణం దాకా ఊరూరా గులాబీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. స్వాగత తోరణాలు స్వాగతమిస్తున్నాయి. ఎన్నికల సభను తలపించేలా కొంగర కలాన్‌ మైదానం గులాబీమయం అయ్యింది. ఇక గ్రామాల నుంచిముందుగానే వాహనాలు బయలుదేరాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా 32 కిలోవిూటరల్‌ పొడవునా ఖమ్మం నుంచి ట్రాక్టర్లలో రైతులు బయలుదేరారు. టిఆర్‌ఎస్‌ తెలంగాణ ఉద్యమ సమయంలోనూ భారీ సభలతో ఎప్పుడూ సత్తా చాటుతూ వచ్చింది. జనసభల నిర్వహణలో టిఆర్‌ఎస్‌ ఎప్పుడూ సక్సెస్‌ అవుతూ వస్తోంది. దీంతో ఈ సభకూడా చరిత్రలో నిలుస్తుందన్న గులాబీ నేతల ప్రకటనలు నిజం అయ్యేలా ఏర్పాట్లు అబ్బుర పరుస్తున్నాయి. ఎన్నికలకు వెల్లాలనుకుంటున్న సిఎం కెసిఆర్‌ ఈ నాలుగేళ్ల తెలంగాణ ప్రగతని ప్రజల ముందుంచనున్నారు. చేపట్టిన కార్యక్రమాలను, పథకాలను ఆయన వివరిస్తారు. ఓఎ రకంగా ఎన్నికల శంఖారవం పూరిస్తారనే అనుకోవాలి. ముఖ్యంగా రైతులకు 24గంటల ఉచిత విద్యుత్‌,పెట్టుబడి సాయం, రైతుబీమ, కాళేశ్వరం తదితర ప్రాజెక్టుల నిర్మాణం, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ తదితర పథకాల విజయాలను ప్రజలకు వివరించనున్నారు. అలాగే ఈ నాలుగేళ్లలో చేపట్టిన షాదీముబారక్‌, కళ్యాణలక్ష్మి తదితర పథకాలను కూడా వివరిస్తారు. వీటిపై విపక్షాలు ఇంతకాలం చేస్తూ వచ్చిన విమర్శలకు కూడా ధీటుగా సమాధానం ఇచ్చేలా సిఎం కెసిఆర్‌ సిద్దంగా ఉన్నారు. మొత్తంగా సభ ముందస్తు సవాల్‌ విసరడంతో పాటు, ప్రజల్లో విశ్వాసం చూరగొనేలా చేయబోతున్నది. కొంగర్‌కలాన్‌లో ఆదివారం జరిగే ప్రగతి నివేదన సభకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మంది హాజరవుతారనే అంచనాల నేపథ్యంలో అటు సాధారణ ప్రజానీకానికి ఇబ్బందులు కలగకుండా సభ నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. ఇందుకోసం ముఖ్యంగా హైదరాబాద్‌ నగర ప్రజలకు ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల నుంచి అనేక వాహనాల్లో నగరబాట పట్టారు. ప్రగతి నివేదన సభ కోసం తరలి వచ్చే లక్షలాది వాహనాలు ఔటర్‌ రింగ్‌ రోడ్డు గుండా నేరుగా సభా స్థలికి చేరుకునేలా రూట్‌ మ్యాప్‌ సిద్దం చేశారు. ఇందుకోసం వ్యూహాత్మకంగా రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేశారు. ప్రగతి నివేదన సభకోసం వచ్చే వారి కోసం మొత్తం 19 మార్గాలను నిర్దేశించారు. ఆయా మార్గాల్లో వచ్చే వాహనాల కోసం జిల్లాల వారీగా ప్రత్యేకంగా 14 పార్కింగ్‌ స్థలాలు ఏర్పాటు చేశారు. ప్రగతి నివేదన సభకు వచ్చే ప్రజలంతా ఓఆర్‌ఆర్‌ విూదుగా రావాల్సి ఉంటుంది. అత్యవసర సమయాల్లో ట్రాఫిక్‌ పోలీసుల సేవలను పొందేందుకు ప్రత్యేక హెల్ప్‌లైన్‌లను అందుబాటులో ఉంచారు. దూర ప్రాంతాల నుంచి ట్రాక్టర్లు, ఆటోలలో వచ్చే పార్టీ కార్యకర్తలు ఒకరోజు ముందుగానే సభా ప్రాంగణానికి చేరుకునేలా ప్లాన్‌ చేశారు. సభ నేపథ్యంలో ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌ ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రయాణాలు వాయిదా వేసుకోవాలిన సిఎం కెసిఆర్‌ స్వయంగా సూచించారు. ఓఆర్‌ఆర్‌పై భారీ వాహనాల రాకపోకలను నిషేధించి.. వాటిని ఇతరమార్గాల ద్వారా మళ్లించేలా ఏర్పాట్లు చేశారు. సభ పూర్తయ్యాక వాహనాలు వచ్చిన మార్గాల్లోనే తిరిగి వెళ్లాలని సూచిస్తున్నారు. 2న ఉదయం 10 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు హైదరాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. సభకు వచ్చే వాహనాలతో ప్రజల రవాణా ఇబ్బందులు, ట్రాఫిక్‌ రద్దీ దృష్ట్యా షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేసినట్టు హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు. ఇక ప్రగతి నివేదన సభకు ట్రాక్టర్ల ద్వారా వస్తున్న రైతులకు పార్కింగ్‌ ప్రాంతాల్లో అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లా నుంచి ఇప్పటికే రెండు వేల ట్రాక్టర్లు బయలుదేరాయి. ట్రాక్టర్ల పైన వస్తున్న రైతుల కోసం మంచినీరు, టాయిలెట్లు, పొయ్యిలు, కట్టెలు, మైక్‌లు ఏర్పాటు చేశారు. నాలుగు వైద్యశిబిరాలు, 30 అంబులెన్స్‌ లు అందుబాటులో ఉంచారు. ట్రాక్టర్లకు ఔట్‌రింగ్‌ రోడ్డుపైకి అనుమతి లేదని, వారు ఓఆర్‌ఆర్‌ సర్వీసు రోడ్డు ద్వారా కొంగరకలాన్‌లోని ప్రగతిప్రాంగణానికిచేరుకోవాలని సూచించారు. సభ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొన్నది. ప్రగతి నివేదన సభాస్థలం గులాబీమయంగా మారింది. మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ఆధ్వర్యంలో ప్రగతి నివేదన సభకు 100 ట్రాక్టర్లతో ర్యాలీగా బయలుదేరనున్నారు. మంత్రి పోచారం జెండా ఊపి ట్రాక్టర్ల ర్యాలీని ప్రారంభించారు.