గొందిగూడెం వద్ద ఇసుక వాగు చప్ట పై న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో రాస్తారోకో
పినపాక నియోజకవర్గం ఆగష్టు 29 (జనం సాక్షి): అశ్వాపురం మండలంలోని గొందిగూడెం నుంచి మనుబోతుల గూడెం వరకు, మరోవైపు గొందిగూడెం నుంచి మామిళ్ళ వాయి వరకు, ఐదు గ్రామ పంచాయతీల పరిధిలో సుమారు 25 గ్రామాలకు నిరంతరం రాకపోకలకు తీవ్ర అంతరాయంగా జరుగుతోందని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో సోమవారం రాస్తా రోకో నిర్వహించారు ఈ సందర్భంగా న్యూడెమోక్రసీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి మోరా రవి మాట్లాడుతూ.గొందిగూడెం నుంచి మనుబోతుల గూడెం వరకు రోడ్డు , ఇసుక వాగు పై బ్రిడ్జిలు నిర్మించాలి. ఇసుక వాగు పై ఆరు చోట్ల, తుమ్మలచెరువు వాగు పై ఒకచోట బ్రిడ్జి లు నిర్మాణంతో పాటు, రోడ్డు నిర్మాణం వెంటనే చేపట్టాలని
ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.పూర్తిగా ఆదివాసి ప్రాంతమైన మారుమూల అడవి గ్రామాల నుండి ప్రజలు తమ అవసరాల కోసం నిరంతరం అశ్వాపురం మండల కేంద్రంతో పాటు, వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారని, ఈ గ్రామాల ప్రజలకు ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చిందంటే మండల కేంద్రానికి వెళ్లి రావడం లేదా పక్క గ్రామానికి వెళ్లి రావడం కూడా కత్తి మీద సాము చేయడం వంటి సాహసంతో కూడిన ప్రయాసగా మారిందన్నారు. ఈ ప్రాంత ప్రజలు ప్రతి సంవత్సరం తమ ఆవేదనను అధికారులకు, ప్రజా ప్రతినిధులకు విన్నవించుకోవడం, వారు పెడచెవిన పెట్టడం, షరా మామూలుగా మారిందని పేర్కొన్నారు. పత్రికలు, మీడియాలో అనేక కథనాలు వచ్చినప్పటికీ పట్టించుకున్న నాధుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిసారి ఎన్నికల సందర్భంలో ఈ సమస్యపై హామీలు ఇవ్వడం తప్ప పరిష్కారానికి అధికార యంత్రాంగం కానీ, నియోజకవర్గస్థాయి ప్రజాప్రతినిధులు కానీ, చిత్తశుద్ధితో పనిచేయలేదని ఆరోపించారు.
ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికార యంత్రాంగం దృష్టి పెట్టి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని లేదంటే న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఈ ప్రాంత ప్రజలతో కలిసి సమస్య పరిష్కారానికి దశలవారీ ఆందోళన చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ మణుగూరు సబ్ డివిజన్ కార్యదర్శి బండ్ల వెంకటేశ్వర్లు, పావురాల లాలయ్య, మడకం మల్లయ్య, గొంది వెంకటయ్య , శర్ప నాగేంద్రబాబు, నారాయణ, పద్మ, భీమయ్య తదితరులు పాల్గొన్నారు.