గ్రామాల అభివృద్దితోనే రాష్ట్రాభివృద్ది: ఎమ్మెల్యే
వికారాబాద్,ఫిబ్రవరి14(జనంసాక్షి): గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. సర్పంచ్‌లు గ్రామానికి ముఖ్యమంత్రిలాంటి వారని గుర్తుంచుకుని పనిచేయాలని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నూతన పంచాయతీరాజ్ చట్టంలో సర్పంచ్‌లు గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకునే విధంగా చట్టం రూపొందించడం జరిగిందని తెలిపారు. హరితహారానికి పెద్దపీట వేస్తూ గ్రామంలో 40వేల మొక్కలు పెంచుకునే విధంగా హరిత వనాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. హరితహారం అన్ని విధాలుగా సక్సెస్ చేస్తే గ్రామాలనని పచ్చదనంతో నిండిపోయి సరైన విధంగా వర్షాలు కురిసి పంటలు బాగా పండడం జరుగుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో సర్పంచ్‌లు మరింత బాధ్యతగా పని చేసి అభ్యర్థులను గెలిపించుకొని వికారాబాద్‌లో టీఆర్‌ఎస్ అంటే తిరుగులేని శక్తిగా నిరూపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.


