చంద్రబాబు యాత్రకు అపూర్వ స్పందన

అదిలాబాద్‌, డిసెంబర్‌ 12 :ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ మరోవైపు వివిధ రాజకీయ పార్టీల వైఖరిని ఎండగడుతూ చంద్రబాబునాయుడు తన పాదయాత్ర కొనసాగిస్తున్నారు. వస్తున్న మీకోసం  పాదయాత్రలో భాగంగా 7వ రోజైన బుధవారం జిల్లాలోని నిర్మల్‌ డివిజన్‌లో పాదయాత్ర చేపట్టి క్షేత్రస్థాయిలో   వివిధ వర్గాల ప్రజలను కలుసుకుంటూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. తమ పాలనలో  గ్రామాలలో అభివృద్ధి పనులు జరిగాయని ప్రజలు ఎలాంటి సమస్యలు లేకుండా ప్రభుత్వ కార్యాలయాల్లో  పనులు చేయించుకునేవారని కాంగ్రెస్‌ పాలనలో ప్రతీ పనికి లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని   చంద్రబాబు దుయ్యబట్టారు. బాబు పాదయాత్రలో కొంత మంది యువకులు తెలంగాణ విషయమై నిలదీయడంతో తాను కాని, తన పార్టీ కాని తెలంగాణకు వ్యతిరేకం కాదని తెలంగాణ విషయంలో తాము స్పష్టంగా ఉన్నామని పేర్కొంటూ వివిధ రాజకీయ పార్టీలు తెలంగాణను  అడ్డం పెట్టుకుని అవకాశవాద రాజకీయాలు చేస్తూ తన పార్టీని బలహీన పరచే విధంగా వ్యవహిస్తున్నారని అన్నారు. కేంద్ర,  రాష్ట్రాలలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉందని తెలంగాణను నిర్ణయించేంది వారేనని ప్రతీసారి ప్రజలు మోసం చేయడానికే  సమావేశలంటూ కాంగ్రెస్‌ ప్రకటించడం విడ్డూరంగా ఉందని అన్నారు. నిర్ణయించే     అధికారం వారికి ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీని విమర్శించడం ఏమీటని ప్రశ్నించారు. అభివృద్ధి విషయంలో పాలకులు  నిర్లక్ష్యంగా వ్యవహిరస్తూ అధికారం కోసం అడ్డదారులు దొక్కుతున్నారని కాంగ్రెస్‌, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలపై విమర్శలు చేశారు.