చిన్నపాటి జాగ్రత్తలతో ప్రమాదాలు నివారించొచ్చు..
రవాణా శాఖ ఉప కమిషనర్ మీరా ప్రసాద్
శ్రీకాకుళం, జూలై 29 : వాహనాలు నడిపే డ్రైవర్లు చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలు నివారించొచ్చని రవాణాశాఖ ఉప కమిషనర్ ఇ.మీరాప్రసాద్ అన్నారు. ప్రమాద రహిత వారోత్సవాల్లో భాగంగా ఆర్టీసీ రెండో డిపోలో వారోత్స వాల ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. 80శాతం ప్రమాదాలు డ్రైవర్ల తప్పిదాల వల్లే జరుగుతున్నాయన్నారు. బస్సులో డ్రైవరు తన కుటుంబ సభ్యుల ఫొటోలు స్టీరింగ్ వద్ద ఉంచుకోవాలని సూచించారు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కుటుంబ సభ్యులు గుర్తుకు వస్తారని, అటువంటి సమయంలో డ్రైవరు ఎటువంటి తప్పిదాలు చేయబోరన్నారు. విధులకు హాజరు కాబోయే ముందు ఆరోగ్యాన్ని ఒకసారి పరీక్షించుకోవాలని డ్రైవర్లకు సూచించారు. డిప్యూటీ సిటిఎం జి.సత్యనారాయణ మాట్లాడుతూ 2011-12లో 69 కోట్ల రూపాయలు ప్రమాద చెల్లింపులకు ఖర్చు చేసినట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం 1, 2 డిపో మేనేజర్లు ఎం.ముకుందరావు, కె. పద్మావతి, సిఐలు సిఆర్ శీలుతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.