జంట జలాశయాలకు చేరని నీరు
హైదరాబాద్,సెప్టెంబర్3(జనం సాక్షి): ఇటీవలి వర్షాలకు జంట జలాశయాలకు మాత్రం పెద్దగా దాహార్తి తీరలేదు. ఇందులో గుక్కెడు నీరు కూడా చేరలేదు. గండిపేట, హిమాయత్ సాగ్‌లలోకి నీరు మాత్రం స్వల్పంగానే వచ్చి చేరింది. నగర వాసుల దాహార్తిని తీర్చే కీలక జలాశయాల్లో ఒకటైన గండిపేటలోకి వరద నీళ్లు వచ్చి చేరితేనే నగర దాహార్తికి ఢోకా ఉండదు. ఎగువన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవడంతో వాగుల్లోకి వరద నీరు చేరింది. ఈ ఏడాది వర్షాలు పుష్కలంగా పడి జలాశయాలు నిండితే ప్రధాన నగరంలోనైనా రోజూ నీటి సరఫరా చేయాలని భావించిన అధికారులకు ప్రస్తుత పరిస్థితులు నీరుగార్చాయి. నాగార్జునసాగర్ నీటి మట్టం పూర్తిస్థాయికి చేరడంతో రోజు విడిచి రోజు నీటికి భరోసా ఏర్పడింది. ఈ దశలో రోజూ నీటి సరఫరా అంటే ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యేలా లేదని సమాచారం. కృష్ణా బేసిన్‌లో భారీగా వర్షాలు కురిసి నాగార్జునసాగర్ నిండినా ఈ ఏడాది రోజూ నీటి సరఫరా అనేది హావిూ వరకే పరిమితమయ్యేలా కన్పిస్తోంది. వాస్తవానికి సాగర్ నుంచి మూడు దశల్లో నిత్యం 264 ఎంజీడీల నీటిని నగరానికి తరలిస్తున్నారు. మరోవైపు నల్గొండ జిల్లాకు నీటిని అందించాలనే ఉద్దేశంతో నగరానికి అందించే జలాల్లో 90 ఎంజీడీలకు కోత పెట్టారు. ఒకటి రెండు రోజుల్లో సరఫరాలో కోత పడనుంది.


