జనరిక్ మందులతో వ్యాపారులకు లాభాలు
గుంటూరు, నవంబర్21: జనరిక్ మందులను జిల్లాలోని ఎక్కువ మంది మెడికల్ షాపుల యజమానులు ఎమ్మార్పీ రేట్లకే విక్రయించి లాభాలు గడిస్తున్నారు. జనరిక్ మందులను గుర్తించేందుకు దానిపై ఎలాంటి గుర్తులు లేకపోవడంతో వినియోగదారులు మోసపోతున్నారు. జనరిక్ మందుల గురించి అవగాహన ఉన్న వారు సైతం వీటిని గుర్తించ లేక ఇబ్బంది పడుతున్నారు. జనరిక్ మందులపై ప్రత్యేక గుర్తు ఏర్పాటు చేసి దానికి ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉందంటున్నారు. దీని వల్ల రోగులు మోసపోకుండా ఉంటారు. జనరిక్ మందులు వచ్చిన తొలిరోజుల్లో మందుల కవర్‌పై కెమికల్ పేరు మాత్రమే ఉండేది. తర్వాత రోజుల్లో దీనిపై ట్రేడ్ నేమ్ రావడం మొదలైంది. దీంతో ఏది జనరిక్, ఏది కాదు అన్న విషయాన్ని తెలుసుకోవడం వైద్యులకు, షాపుల నిర్వాహకులకు సైతం కష్టంగా మారింది. గతంలో మాదిరి కెమికల్‌పేరుతో వచ్చినా కొంత వరకు గుర్తించే వీలు ఉంటుంది. జనరిక్ ఔషధాలకు, సాధారణ ఫార్మా ఔషధాలకు ఏ మాత్రం తేడా ఉండదు.ప్రచారం లేకపోవడం వల్ల వీటి గురించి వైద్యులకు అంతఅంతమాత్రమే అవగాహన ఉంటుంది. కొందరికి అవగాహనా ఉన్న వేరే కారణాలతో వీటిని ప్రోత్సహించడం లేదన్న విమర్శలున్నాయి. జనరిక్ మందులుజిల్లాలో దాదాపు అన్ని దుకాణాల్లో జనరిక్ మందులు విక్రయిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని తెలిపేలా బోర్డులు ఎక్కడా ఏర్పాటు- చేయలేదు. దీంతో అవగాహన లేక రోగులు సాధారణ మందులు కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో జనరిక్ మందులు విక్రయించే మెడికల్ షాపుల నిర్వాహకులు తప్పనిసరిగా ‘జనరిక్ మందులు లభించును’ అన్న బోర్డును ఏర్పాటు చేయాలని డీఎంహెచ్‌వో గోపీనాయక్ అన్నారు. దీనిపై వారికి అవగాహన కల్పించి ప్రతి షాపు ఎదుట బోర్డు ఏర్పాటు- చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.



