‘టీడీపీ సభావేదికకు నిప్పుపెట్టింది మేమే’

వరంగల్ : వరంగల్ జిల్లాలో టీడీపీ సభా వేదికకు తామే నిప్పు పెట్టినట్టు ఎమ్మార్పీఎస్ గురువారం స్పష్టం చేసింది. పాదయాత్ర సమయంలో తమను రక్షణ కవచంగా వాడుకుని…ఇప్పుడు వర్గీకరణ విషయంలో చంద్రబాబు ఓడ మల్లన్న పాట పాడుతున్నారని ఎంఆర్‌పీఎస్‌ కార్యకర్తలు మండిపడ్డారు. చంద్రబాబు వరంగల్ చేరేలోపు సంచలనం రేపుతామని వారు హెచ్చరించారు. చంద్రబాబు గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

మరోవైపు చంద్రబాబు నాయుడు వరంగల్‌ జిల్లా పర్యటనకు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు అడుగడుగునా అడ్డుపడుతున్నారు. పలుచోట్ల టీడీపీ జెండాలు తగలబెట్టారు. వరంగల్ జిల్లా టీడీపీ కార్యాలయంపై కార్యకర్తలు దాడి చేసి నిప్పు పెట్టేందుకు యత్నించారు. కాగా అంతకు ముందు హన్మకొండ బస్టాండ్ సమీపంలోని హయగ్రీవాచారి మైదానంలో టీడీపీ సభ నిర్వహించడానికి ఏర్పాటు పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొంతమంది గుర్తు తెలియని దుండగులు వేదికకు నిప్పుపెట్టారు.

దీంతో వేదిక వెనుక భాగం దగ్ధమైంది. మంటల్లో బ్యానర్లు, ప్లెక్సీలు, జెండాలు, ఫర్నిచర్ దగ్ధమయ్యాయి.  దీంతో ఎంఆర్‌పీఎస్‌ కార్యకర్తలే..సభావేదికను తగలబెట్టారనే ఆగ్రహంతో..తెలుగుదేశం అభిమానులు..ఎంఆర్‌పీఎస్‌ కార్యకర్తను చితక్కొట్టారు. పోలీసులు చూస్తుండగానే చితకబాదారు.