‘ట్యాంకుబండ్‌పైనే ‘ తెలంగాణ మార్చ్‌’

హైదరాబాద్‌: నగరంలోని ట్యాంకుబండ్‌పైనే ‘ తెలంగాణ మార్చ్‌’ను నిర్వహించనున్నట్లు తెలంగాణ రాజకీయ జేపీసీ ఛైర్మన్‌ కోదండరాం ప్రకటించారు. ఇవాళ టీఎస్‌జీవో భవన్‌లో జేఏసీ సమావేశమైన  అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ మార్చ్‌కు ‘సాగర్‌ హారం’ అని నామకరణం చేసినట్టు ఆయన వెల్లడించారు. కవాతును శాంతియుతంగా నిర్వహించాలని ఆయన కోరారు. మార్చ్‌లో కళాకారులు, గాయకులు వివిధ కళలలను ప్రదర్శించడానికి వేదికలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలియజేశారు. మార్చ్‌కు అనుమతి ఉందాలేదా అని అందరు అడుగుతున్నారని, కానీ పోలీసులకు మనం సమాచారం  మాత్రమే ఇస్తామని, మార్చ్‌కు సంబంధించి వారు శాంతి భద్రతల ఏర్పాట్లు చేసుకుంటారని కోదండరాం తెలియజేశారు. తెలంగాణ మార్చ్‌ను నిరాటంకంగా నిర్వహించేందుకు తెలంగాణ మంత్రులు పాటుపడాలని కోరారు. సెప్టెంబర్‌ 30లోపు తెలంగాణ ప్రకటన రాకుంటే మంత్రులు కూడా మార్చ్‌లో పాల్గోన్నాలని ఆయన డిమాండ్‌ వ్యక్తం చేశారు. అసలు తెలంగాణ మంత్రుల వైఫల్యమే మార్చ్‌ నిర్వహించే వరకు తెచ్చిందని , మంత్రులు తెలంగాణ ప్రజలతో ఉంటర, సీమాంధ్ర నేతలతో ఉంటరా తేల్చుకోవాలని ఆయన డిమాండ్‌ వ్యక్తం చేశారు. ఇదే మంత్రులకు డెడ్‌లైన్‌ అని ఆయన హెచ్చరించారు. ఉద్యమాన్ని ప్రభుత్వం అణచివేయాలని చూస్తే అది మూర్ఖత్వమేనని ఆయన స్పష్టం చేశారు. ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తామని ఆయన హెచ్చరించారు.