డీఎల్‌ ఇంటర్వూలను నిలిపివేయండి: హరీష్‌రావు

హైదరాబాద్‌: ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న డీగ్రీ లెక్చరర్ల నియామకపు ఇంటర్వూలకు తెలంగాణ సెగ తగలనుంది. ఇవాళ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసి డీగ్రీ లెక్చరర్ల నియామకంలో తెలంగాణ నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని, సీఎం వెంటనే జోక్యం చేసుకుని ఇంటర్వూలను నిలిపివేయాని కోరారు. ఇతర ఉద్యోగాల మాదిరిగానే వీటిని కూడా జోన్ల వారిగా భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏపీపీఎస్సీ ఈ పోస్టులను స్టేట్‌వైడ్‌గా భర్తీ చేయడం వల్ల తెలంగాణ ప్రాంతం వారు తీవ్రంగా నష్టపోతున్నారని సీఎంకు తెలియజేశారు. సీఎంను కలిసిన అనంతరం హరీష్‌రావు మాట్లాడుతూ.. లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతుందని విమర్శించారు. మల్లీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్లు గత 30 రోజులుగా తమను విధుల్లోకి తీసుకోవాలని దీక్ష చేస్తున్నా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని హరీష్‌రావు డిమాండ్‌ వ్యక్తం చేశారు.