తెలంగాణలో ప్రశాంతంగా బంద్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రసమితి ఇచ్చిన పిలుపుమేరకు తెలంగాణలోని పది జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగింది. రాష్ట్రరాజధాని హైదరాబాద్‌లోని పలుప్రాంతాల్లో తెరాస శ్రేణులు ఆర్టీసీ బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు. అనేక చోట్ల రాస్తారోకో కార్యక్రమాలు నిర్వహించారు.
ఆదిలాబాద్ జిల్లాలోని కోల్‌బెల్ట్ ప్రాంతమైన మందమర్రి, బెల్లంపల్లి, శ్రీరాంపూర్‌లతో పాటు మిగిలిన ప్రాంతాల్లో బంద్ ప్రశాంతంగా కొనసాగింది. ఖమ్మం జిల్లాలో బంద్ పాక్షికంగా జరిగింది. కొద్ది సంఖ్యలో బస్సులు రోడ్లపై తిరిగాయి. కరీంనగర్ జిల్లాలో బంద్ విజయవంతమైంది. విద్యాసంస్థలు, బ్యాంకులు, వాణిజ్య సంస్థలు, వివిధ కార్యాలయాలు బంద్ పాటించాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో బంద్ పాక్షికంగా జరిగింది. ఉదయం నుంచే తెరాస కార్యకర్తలు బస్సులను అడ్డుకున్నారు. అయినా అక్కడక్కడా బస్సులు యధావిధిగా రాకపోకలు కోనాగించాయి. దేవరకద్రలో తెరాస కార్యకర్తలు మోటారు సైకిల్ ర్యాలీని నిర్వహించాయి. నిజామాబాద్ పట్టణంలో పీడీఎన్‌యూ కార్యకర్తలు ఎంపీ మధుయాష్కీ నివాసాన్ని ముట్టడించారు. పోలీసులు వారిని అరెస్టు చేశారు, నల్గొండ జిల్లాలో బంద్ సంపూర్ణంగా జరిగింది. బస్సు డిపోల ముందు తెరాస కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. మెదక్ జిల్లాలో బంద్ ప్రశాంతంతగా సాగింది. జిల్లాలోని ప్రధాన పట్టణాలు, మండలంకేంద్రాలో తెరాస నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. వరంగల్ జిల్లాలో బంద్ విజయవంతమైంది. తెరాస శ్రేణులతో పాటు ఆర్టీసీ కార్మికులు కూడా పలు చోట్ల ఆందోళనకు దిగారు.