తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర కీలకం

టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌
హైదరాబాద్‌, డిసెంబర్‌ 15 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిర్వహిస్తున్న ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర ఎంతో కీలకమైనదని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. నివారం సాయంత్రం సికింద్రాబాద్‌లోని జూబ్లీ బస్‌స్టేషన్‌ ఆవరణలో నిర్వహించిన టీఎంయూ భారీ బహిరంగసభలో ఆయన మాట్లాడారు. సీమాంధ్రుల పాలనలో ఆర్టీసీ ఎంతో నష్టపోయిందన్నారు. కార్మికులు ఎంతో వివక్ష ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకాలం గుర్తింపు సంఘంగా ఉన్న ఎన్‌ఎంయూ కార్మికులు హక్కులు యాజమాన్యానికి తాకట్టుపెట్టిందని ఆరోపించారు. ఈ విషయం ఎన్నో సందర్భాల్లో బట్టబయలైన విషయం కార్మికులు గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితేనే ఆర్టీసీకి మనుగడ ఉంటుందన్నారు. కార్మికులు మూకుమ్మడిగా తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్మికులు ఐక్యమైతేనే సీమాంధ్రుల దురహంకార అధిపత్యానికి చరమగీతం పాడొచ్చని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పొలిట్‌ బ్యూరో సభ్యుడు ఎర్రోళ్ల శ్రీనివాస్‌, టీఎంయూ నేతలు పాల్గొన్నారు.