తెలుగు భాషను అవమానించే వారిపై కఠిన చర్యలు

హైదరాబాద్‌: తెలుగు మహాసభల సందర్భంగా తెలుగు భాషాభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్ని పక్షాలు డిమాండ్‌ చేశారు. పాలనా పరంగానూ, విద్యాపరంగానూ భాష నిర్లక్ష్యానికి గురి కావటం పట్ల వారు గట్టిగా ప్రశ్నించారు. ఇవాళ సచివాలయంలో తెలుగు మహాసభలపై ముఖ్యమంత్రి అఖిల పక్ష సమావేశాన్ని  నిర్వహించారు. దీనికి భాజపా, తెదేపా, సీపీఎం, లోక్‌సత్తా ప్రతినిధులు మాత్రమే హాజరయ్యారు. మిగిలిన పక్షాల ప్రతినిధులు హాజరుకాలేదు. ఈ సభల నిర్వహణ కోసం అందరి సహకారం అవసరమని ప్రభుత్వం కోరింది. ఈ సభల సందర్భంగా ప్రభుత్వం అభివృద్ధి చేయాల్సిన  అంశాలను ఆయా పార్టీల ప్రతినిధులు సీఎం దృష్టికి తెచ్చారు. ఈ నెల 27నుంచి 29 వరకు తిరుపతిలో తెలుగు మహాసభలు జరుగుతున్నాందున తెలుగు వాడకాన్ని ప్రోత్సహించటంతో పాటు భాషను అవమానించే వారి పట్ల కఠిన శిక్షలు అమలు చేయాలని వీరు డిమాండ్‌ వ్యక్తం చేశారు.