దేశవ్యాప్తంగా అన్ని కాలేజీల్లో ఎన్‌సీసీ!

జనంసాక్షి, హైదరాబాద్‌ : యువతలో క్రమశిక్షణ, దేశభక్తి స్ఫూర్తిని పెంపొందించేందుకు దేశవ్యాప్తంగా అన్ని కాలేజీల్లో దశల వారీగా నేషన్‌ కేడెట్‌ కోర్‌ (ఎస్‌సీసీ)ని ప్రవేశపెట్టాలని కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖ నిర్ణయించింది. ఉన్నత విద్యలో సామాజిక బాధ్యతను పెంపొందించాలన్న 12న పంచవర్ష ప్రణాళిక సూచనల ప్రకారం ఎన్‌ఎస్‌ఎస్‌, ఎన్‌సీసీ, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను అమలు చేయడంపై దృష్టి సారించింది. తొలుత దేశంలోని 30 స్వయంప్రతిపత్తి (అటానమస్‌) కలిగిన కాలేజీల్లో 2013-14 విద్యా సంవత్సరంలో అమలు చేయాలని… తర్వాత మరో 400 అటానమస్‌ కాలేజీలకు విస్తరింపజేయాని, 2014-15 ఇతర కాలేజీల్లో అమలు చేయాలని భావిస్తోంది. ఈనెల 2న జరిగిన సెంట్రల్‌ అడ్వైజరీ బోర్డు ఫర్‌ ఎడ్యుకేషన్‌ (సీఏబీఈ) సమావేశంలోనూ ‘స్కూళ్లు, కాలేజీల్లో ఎస్‌సీసీ’ అంశంపై చర్చించినట్లు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌ మిశ్రా పేర్కొన్నారు.