ధాన్యం కొనుగోళ్లలో ప్రత్యేక శ్రద్ద
యాదాద్రి భువనగిరి,నవంబర్1(జనంసాక్షి): ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలు లేకుండా ఊడాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని అన్నారు. ప్రభుత్వం మద్దతు ధరను చెల్లిస్తుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రెవెన్యూ అధికారులు అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి వివరాలు సిద్దం చేసుకోవాలన్నారు. ఒకవేళ తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే రైతులు అప్రమత్తంగా ఉండాలని, టార్పాలిన్‌తో ధాన్యాన్ని కప్పి ఉంచుకోవాలన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పౌర సరఫరాల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు.
దోమల వ్యాప్తి నిరోధానికి చర్యలు
ఇదిలావుంటే రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో డెంగీ ప్రబలుతున్న నేపథ్యంలో వ్యాధులు విజృంభించకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అనితా రామచంద్రన్ సూచించారు. గ్రామాల్లో ఎక్కడా మురుగు నీరు నిల్వకుండా, దోమలు వ్యాప్తి చెందకుండా ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎప్పటికప్పుడు అధికారులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరును పర్యవేక్షించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్ల పనితీరును పరిశీలించాలన్నారు. శిథిలావస్థకు చేరిన వసతి గృహాలను, పాఠశాలలను గుర్తించాలన్నారు. ఆయా భవనాలను మరొక చోటికి మార్చాలని అన్నారు. ప్రజావాణిలో ప్రజలిచ్చిన అర్జీల్లో పేర్కొన్న సమస్యల పరిష్కారం కోసం అధికారులు ఎప్పటి కప్పుడు నివేదికలను అందజేయాలని అన్నారు. సమస్యల పరిష్కారమే ఎజెండాగా ఉన్నతాధి కారులు విధులు నిర్వర్తించాలన్నారు. అలాగే అభివృద్ధిలో యాదాద్రిని అగ్రభాగంలో నిలుపాలని కలెక్టర్ అన్నారు. కార్యాలయంలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న అధికారులు తమకు విధించిన పనులను సక్రమంగా నిర్వహించి పేరుతీసుకుని రావాలన్నారు. ఇంకుడు గుంతలు, వ్యక్తిగత మరుగుదొడ్లు ప్రజలు నిర్మించుకునేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు. ఈ సందర్భంగా మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షల్లో రాష్ట్రంలోనే ఉత్తమ ఫలితాలు
సాధించే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కస్తూర్బా, గురుకుల పాఠశాలల్లో, అంగన్‌వాడీ కేంద్రాల్లో విరివిగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్‌బెడ్‌రూం ఇళ్ల టెండర్ల పక్రియను పూర్తి
చేయాలని, ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు చేపట్టడంతో పాటు మంజూరైన రోడ్లను వెంటనే చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ, హరితహారం పథకాలపై తగు శ్రద్ద తీసుకోవాలని ఆదేశించారు.



