నగరం మూగబోయింది…!

share on facebook

ఈ నగరానికి ఏమైందో…?

ఏ జఢత్వ నీడ కమ్మిందో

ఏ అలసత్వ చీడ పట్టిందో

అందుకే పెను నిద్రలో మునిగింది

ఈ పట్టణ ప్రజానీకానికి ….

ఏ నైరాశ్యం ఒంటబట్టిందో

ఏ భయం చుట్టుముట్టిందో

అందుకే…!

గ్రేటర్ ఎన్నికల రణ క్షేత్రంలో

అచేతనా పాత్ర పోషించింది

మందకోడితనం నెత్తికెత్తుకు

ఓటుకు “ఓటమి” కట్టబెట్టింది

ప్రజాస్వామ్యాన్ని పరిహసించింది

సరే అందుకు మనలో మన మాటగా…

కరోనా కలవరపాటే అనుకుందాం

దైవ మందిరాలు, తీర్థ యాత్రలు

వివాహ వేడుకలు, వార సంతల్లో

సమూహ దృశ్యాలు సహజమే కదా ?

కడకు “మందు” షాపుల ముందు

క్యూలైన్లతో తోపులాడు సందర్భాలు

కోకొల్లులుగా సాక్షాత్కారమే కదా ?

పోనీ…

అసమర్ధ అభ్యర్థులే అనుకుందాం

అందుకు “నోటా” అస్త్రం సంధించి

నిరసన చాటే “బాట” ఒకటుంది  కదా?

ఇవేవీ పట్టని సగటు ఓటరు తీరు

ఆత్మహత్యా సదృశ్యాన్ని తలపిస్తుంది

ఇకనైనా  ప్రతి పౌరుడు

అంకితభావంతో “ఓటు” వినియోగిస్తే

స్వపరిపాలన సచ్చీలమై సాగుతుంది

ప్రజాస్వామ్యం పచ్చగా విలసిల్లుతుంది

                    “”””””””””“”””””

(జి. హెచ్.ఎం.సి. ఎన్నికల నేపథ్యంలో  ఓటరు నిర్లిప్త తీరుకు స్పందనగా…)

                         కోడిగూటి తిరుపతి

                             Mbl no :9573929493

Other News

Comments are closed.