నాలుగేళ్లు అవుతున్నా గండిపడ్డ కాల్వకు మరమ్మత్తులు లేవు

కర్నూలు,నవంబర్‌ 21: భారీవర్షాల కారణంగా తెలుగుగంగ ప్రధాన కాలువకు బండిఆత్మకూరు మండలం కృష్ణనంది నుంచి మహానంది క్షేత్రానికి వెళ్లే మార్గంలో గండి పడింది. నాలుగేళ్ల క్రితం కురిసిన వానలకు  ప్రధాన కాల్వకు గండి పడింది.  తెలుగుగంగ కాలువలో ప్రవహించే కృష్ణా జలాలు 10వ బ్లాక్‌లో పడిన గండి కారణంగా పక్కకు మళ్లుతున్నాయి. గతంలో ప్రధాన కాలువ సవిూపంలో సవిూప గ్రామాల ప్రజలు మట్టికోసం తవ్వకాలు జరపడంతో ఆ గుంతల్లోకి తెలుగుగంగ నీరు వెళ్లిపోతోంది.అయితే అధికారులు మాత్రం తెలుగుగంగ నీరు గండి ద్వారా బయటకు వెళ్లడం లేదని బుకాయిస్తున్నారు. ప్రధాన కాలువ ఎడమ వైపు ఎత్తుగా ఉండడంతో నీరు బయటకు వెళ్లే అవకాశం లేదని అంటున్నారు. గండి ద్వారా నీరు బయటకు వెళ్తున్నట్టు- కనిపిస్తున్నా అధికారులు ఇలాంటి సాకులు చెబుతుండడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగుగంగ ప్రధాన కాల్వలో కొంత భాగంలో లైనింగ్‌ పనులు జరగలేదు.ఈ పనులు కూడా చేపట్టేందుకు ఎన్నో ఏళ్ల నుంచి టెండర్లు పిలుస్తున్నా కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం, అధికారులు కాలువలో నీళ్లులేని సమయంలో టెండర్లు పిలువక పోతుండడంతో సమస్య జఠిలంగా మారింది. ప్రధాన కాలువకు ఉన్న పెండింగ్‌ లైనింగ్‌ పనులతో పాటు- గండిని పూడ్చేందుకు సంబంధించిన ప్రతిపాదనలు రెండింటినీ కలిపి చేయాలని ప్రతిపాదిస్తుండడం గండి మరమ్మతు పనులకు ఆటంకంగా మారింది. శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి కృష్ణా జలాలు పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా బానకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ వరకు చేర్చి అక్కడి నుంచి వెలుగోడు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌కు చేరతాయి. వెలుగోడు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లో నీటిమట్టం స్థాయిని బట్టి తెలుగుగంగ ప్రధాన కాల్వకు నీటిని విడుదల చేస్తారు. తెలుగుగంగ కింద వెలుగోడు, బండిఆత్మకూరు, నంద్యాల, మహానంది, రుద్రవరం, శిరువెళ్ళ, ఆళ్ళగడ్డ, చాగలమర్రి తదితర మండలాల్లో వేలాది ఎకరాల ఆయకట్టు- ఉంది. ముఖ్యంగా వరితో పాటు- అరటి, చెరుకు, పసుపు, సీడ్‌జొన్న పంటలు సాగవుతాయి. ఆయకట్టు- రైతులకు సాగునీరు అందించడంతో పాటు- కడప, నెల్లూరు జిల్లాల విూదుగా తమిళనాడు రాజధాని చెన్నై నగరానికి తాగునీటి కోసం కృష్ణా జలాలను తెలుగుగంగ పథకం ద్వారా పంపడం జరుగుతోంది.  ప్రధాన కాలువ కట్ట నిర్మాణంలో నాసిరకం పనులు చేపట్టిన కారణంగానే వరదల తాకిడికి తట్టు-కోలేక గండిపడినట్లు- అప్పట్లోఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే గండి పూడ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టలేదు. తెలుగుగంగ ప్రధాన కాల్వకు భారీ గండి పడి నాలుగేళ్లు గడుస్తున్నా పూడ్చే ప్రతిపాదనలకు బూజు పట్టింది. ఈ పనులకు ప్రభుత్వం ఎప్పుడు అనుమతి ఇస్తుందో, అనుమతి ఇచ్చినా కాంట్రాక్టర్లు ఎప్పుడు ముందుకు వస్తారో తెలియని పరిస్థితుల్లో గండి మరమ్మతుకు లైనింగ్‌ పనులతో లింకు పెట్టడం ఎంతవరకు సమంజసమని రైతులు ప్రశ్నిస్తున్నారు.