నిరసనల మధ్య ఆరంభమైన కాకతీయ ఉత్సవాలు

గ్రేటర్‌ కార్పొరేషన్‌గా వరంగల్‌

వచ్చే రెండేళ్లలో 31 లక్షల ఎకరాలకు సాగునీరు
ముఖ్యమంత్రి కిరణ్‌

వరంగల్‌, డిసెంబర్‌ 21 (జనంసాక్షి) : కాకతీయ ఉత్సవాలు శుక్రవారం నిరుత్సాహం గా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఖిలా వరంగల్‌లో నిర్వహించిన సమావేశంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు.
కాకతీయ సామ్రాజ్యం విస్తరించిన ప్రాంతాల్లోనూ ఉత్సవాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. కాకతీయులు తమిళనాడు, కర్నాటక ప్రాంతా ల్లోనూ తమ సామ్రాజ్యాన్ని విస్తరించారని అన్నారు. వరంగల్‌
నగరాన్ని గ్రేటర్‌ వరంగల్‌గా మారుస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ముఖ్యమంత్రి కాకతీయ ఉత్సవాలు ప్రారంభించిన ప్రాంగణం వద్ద తెలంగాణవాదులు నిరసన తెలిపారు. పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. అంతకు ముందు ఆయన బొమ్మకూరు జలాశయాన్ని ప్రజలకు అంకితం చేశారు. వచ్చే రెండేళ్లలో 31 లక్షల ఎకరాలకు సాగునీరు అందచేస్తామని హావిూ ఇచ్చారు. కాకతీయ ఉత్సవాల్లో పాల్గొనడానికి జిల్లాకు వచ్చిన సీఎం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.దేవాదుల ప్రాజెక్టులో భాగంగా బొమ్మకూరులో నిర్మించిన రిజర్వాయర్‌కు ప్రారంభోత్సవం చేసి ప్రజలకు అంకితం చేశారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ వేదికపై బైఠాయించి సీఎం ప్రసంగిస్తుండగా జైతెలంగాణ నినాదాలతో అడ్డుకున్నారు. ఆయన వేదికపై కింద కూర్చుని చిరంజీవి,సీఎం ప్రసంగానికి అడ్డు తగిలారు. ఆ తరవాత కొద్ది సేపటికి ఎమ్మెల్యే వేదిక దిగి వెళ్లిపోయారు.తెలంగాణ నిరసనలు మిన్నంటడంతో సీఎం కాకతీయ ఉత్సవాల ప్రారంభోపన్యాసాన్ని పేలవంగా ముగించారు. తెలంగాణ వాదులు జైతెలంగాణ నినాదాలు చేస్తూ సీఎం ప్రసంగానికి అడ్డతగలడంతో ఆయన ఐదు నిమిషాలలోనే తన ప్రసంగాన్ని పూర్తి కానిచ్చారు. చిరంజీవికి తెలంగాణ సెగ కేంద్ర మంత్రి చిరంజీవికి తెలంగాణ సెగ తగిలింది. వేదికపై నుంచి ఆయన ప్రసంగించడం ప్రారంభించగానే సభాప్రాంగణం పెద్ద ఎత్తున జైతెలంగాణ నినాదాలతో మారుమోగింది. తెలంగాణపై మంత్రి స్పష్టమైన వైఖరి చెప్పాలంటూ తెలంగాణ వాదులు డిమాండ్‌ చేశారు. కుర్చీలు పైకి ఎగురవేస్తూ నిరసనలు మిన్నటించారు. దీంతో మంత్రి అతి త్వరగా తమ ప్రారంభోపన్యాసాన్ని విరమించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, సారయ్య, రాంరెడ్డి వెంకట్‌ రెడ్డి, ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి, గండ్ర వెంకటరమణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాల పట్ల తెలంగాణ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర కలిగిన కాకతీయుల ప్రాభావాన్ని చాటే విధంగా ప్రభుత్వం కాకతీయ ఉత్సవాలను జరపాలని తెలంగాణ ప్రజలు చేసిన విజ్ఞప్తిని సర్కారు పెడచెవిన పెట్టింది. ఈ ఉత్సవాలకు నూటయాబై కోట్లు కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ వాదులు ఆందోళన చేశారు.