నిలువుదోపిడికి పాల్పడుతున్న కార్పోరేటు వైద్యం!

share on facebook
కాలక్రమేణా పరిణామక్రమంలో భాగంగా సమాజంలోని వింతపోకడలను పరిశీలిస్తే.. ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తూ,ఆందోళనబాట పట్టిస్తుందినడంలో నిజంలేకపోలేదు. వాతావరణ కాలుష్యం, క్రిమి సంహారక రసాయనిక ఎరువులు, మందులు వాడుతూ పంటలు పండించడం, ఆరోగ్యానికి హాని కలిగించేటువంటి కార్బైడ్ లాంటి పదార్థాలను ఉపయోగించి ఫలాలను తాజాగా కనిపించడం కోసం వాడటం, ప్రోటీన్స్, విటమిన్స్, కార్బో హైడ్రేట్స్ లేనటువంటి, పోషకాహారలేమి ఆహార పదార్థాలను తీసుకోవడం మూలంగా శరీరంలో క్రమంగా రోగనిరోధక శక్తిని కోల్పోయి, భిన్న రోగాల బారిన పడి, స్తోమతకు మించి ఖర్చులు కావడంతో, అటు ఆర్థిక సమస్యలు, ఇట్లు మానసిక సమస్యలతో ప్రజల జీవితాలు అగమ్య  గోచరంగా మారి ,అష్టకష్టాలపాలు చేస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
    సమాజంలో పరిణామ క్రమంలో భాగంగా ఎక్కడైనా కొసరే అవకాశమున్న, వైద్యం  విషయంలో అలాంటి ఆలోచనలకు తావు లేకపోగా, అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు, ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందేమోనన్న భయంతో మారుమాట లేకుండా, డాక్టర్లను వారి ప్రాణాలను కాపాడే దేవతలు, దేవుళ్ళుగా భావించి, అడిగినంత ముట్ట చెప్పడానికి విశ్వ ప్రయత్నాల వేటలో  మునిగిపోతారు . ఏ రోగి రక్తం బంధువులైన ప్రాణాలను రక్షింపచేయడానికి ఖర్చులకు వెనకాడకుండా, మొండి ధైర్యంతో ముందుకు వెళ్లడం అనేది గమనించవచ్చు. ఇలాంటి సందర్భాలను ఆర్థికంగా మార్చుకోవడానికి మల్టీ-స్పెషాలిటీ దావకానలు కార్పొరేట్ వైద్యం ముసుగులో అనుసరించే నూతన పోకడలను చూస్తే ఆశ్చర్యమేయక  తప్పని పరిస్థితి.
అనారోగ్యానికి గురైన వ్యక్తిని కార్పొరేటు
     వైద్యశాలకు తీసుకెళితే తాత్కాలిక ఉపశమన కోసం ఏవో రెండు ఇంజెక్షన్లు ,గ్లూకోస్ పెట్టి, రక్త నమూనా సేకరించి ,వారి దావకానలోనున్న పలు పరీక్ష కేంద్రాలకు పంపి, పరీక్షలు చేయించమని కోరతారు. ఇక్కడ ఇన్ని పరీక్షలు ఎందుకనే ప్రశ్నకు తావులేని పరిస్థితి. ఇంకా ఎవరైనా బంధువర్గం ప్రశ్నిస్తే… ఏం అయ్యిందో, ఎలా ఉందో తెలిసేదెలా? వీటిని చేస్తేనే వాటి ఫలితాల ఆధారంగా వైద్యం అందించడానికి ఆస్కారం ఉంటుందని సెలవిస్తూ, ఆపై మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఇక్కడి నుండి తీసుకెళ్లండి అని ఉచిత సలహా సైతం ఇవ్వడం జరుగుతుంది. అలాగని ఆయా రక్తపరీక్షలతోనే ఒకటి రెండు రోజుల్లో తగ్గదు. తగ్గితే కార్పోరేట్ వైద్యం ఎలా అవుతుంది? వారం,10 రోజులు గడిచి, ఎక్స్ రే , సిటీ స్కాన్, ఎం ఆర్ ఐ, బెడ్ ఛార్జ్, మందుల నిమిత్తం 50 వేల నుండి మొదలు కొంటే ఆపై రోగాన్ని బట్టి, పరిస్థితులను బట్టి ఎంతవుతుందో ఎవరికి తెలియని పరిస్థితి నెలకొంటుందని అనడంలో ఎలాంటి ఆవాస్తవం లేదు.
    గత కొంతకాలంగా తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు ఆర్జించడానికి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఎన్నో బ్రాంచ్ లను తెరవడం, విభిన్న రోగాలను నయం చేసే వైద్యులు అందుబాటులో ఉంటారని పేర్కొనడం జరుగుతుంది. కానీ ఆయా వైద్య నిపుణులు రోజంతా అందుబాటులో ఉండలేని పరిస్థితి, వారంలో ఒకటి రెండు రోజులు లేదా రోజులో రెండు మూడు గంటలు పనిచేస్తూ, అతని శక్తిమేరకు మరిన్ని ఇలాంటి హాస్పిటల్ లో ఇలాగే పనిచేస్తూ లాభాలబాటలకై అన్వేషిస్తూ ఉంటారు. కానీ ఇలాంటి హాస్పిటల్స్ అన్ని రోజులలో 24 గంటలు తెరుచుకోని ఉంటూ, అందులో కేవలం రక్తపరీక్షలు చేసేవారు, నర్సులు మరియు మందుల షాపు పనిచేస్తూ ఉంటూ ఉంటాయి… ఎలాంటి కేసులను అయినా తీసుకొని డాక్టర్లకు ఫోన్లో అందుబాటులో ఉంటూ, వారు సూచించిన విధంగా పరీక్షలు చేయించడం మందులు  ఇవ్వడం, అత్యవసర పరిస్థితులు ఏర్పడితే మరో హాస్పిటల్ కు రిఫర్ చేయడం,వచ్చే ఆదాయాన్ని బట్టి డాక్టర్లురావడం జరుగుతుంది. ఇక్కడ జరిగే దరిద్రమైన విషయం ఏమిటంటే డాక్టర్లు లేకున్నా, వారి ఫీజును,బెడ్ చార్జి, మెడిసిన్ ..వారు అందించిన సేవలకు అధిక మొత్తంలో డబ్బును లాక్కోవడం సర్వసాధారణం. ఇక్కడ ఇంకొక ప్రత్యేకమైన విషయాన్ని గ్రహించవచ్చు… రోగి యొక్క పరిస్థితి ఆందోళన కలిగించే విధంగా ఉంటే, ఆ వ్యాధి ఆరోగ్య శ్రీ పరిధిలోకి వస్తే… తమకు అనుకూలమైన లేదా వారి యొక్క మరో బ్రాంచ్ కు రిఫర్ చేసి, రోగికి సంబంధించిన కుటుంబ సభ్యులకు ఉచిత సలహాలు ఇస్తూ, ఆలస్యం చేయకుండా  వెళ్లండని, ఆందోళనలకు గురిచేస్తూ పంపిస్తారు, అక్కడికి వెళితే నర్సుల పర్యవేక్షణలో కొన్ని గంటలపాటు ఉంచి, వారే వచ్చి సర్జరీ చేయడం, గతంలో చేసిన పరీక్షలు అన్నియు ఆరోగ్య శ్రీలో నమోదు చేసుకుని బిల్లును తీసుకోవడమే కాకుండా ప్రభుత్వం ఇచ్చే మందుల వలన వ్యాధి అంతత్వరగా నయం కాదు, ప్రైవేటుగా వారివద్ద వారం రోజుల పాటు, వేలకు వేలు పెట్టి కొనేటట్టు చేసి, వ్యాపారం చేయడం జరుగుతుంది. ప్రభుత్వపరంగా ఎన్ని యంత్రాంగాలు పనిచేసిన నోరు విప్పలేని పరిస్థితి ఒక వైపు ఉంటే, ప్రశ్నిస్తే రోగిని మరింత ఇబ్బంది పెడతారు అని బాధ మరోవైపు కల్పిస్తూ లాభార్జనకు దోహదపడుతున్నారు. ఈ విషయంలో పరిశోధన గావిస్తే  అసలైన నిజాలు వెల్లడవుతాయి కానీ ఆ విషయాన్ని పట్టించుకునే నాథుడే ఉండడు.
    ధనవంతులు, డబ్బున్న వాళ్ళకు ఇదిఒక సమస్యగా అనిపించకపోవచ్చు కానీ పేదవారికి భరించలేని భారంగా ఉంటుంది.అలాగే ప్రస్తుత తరుణంలో రోగాలు  అనేవి సర్వ సాధారణమయ్యాయి. అందుకే సమాజంలో వైద్యశాలలు అన్ని ప్రభుత్వ పరంచేసి ఉచిత వైద్యం అందజేసే.. ప్రభుత్వాలు అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. దీనితోపాటు విద్యను సైతం సాధారణ ప్రజలకు అందుబాటులోకి తెస్తే ప్రజలపాలిట ఆపన్నహస్తం అందించిన వారవుతారు కావున సమాజంలో దేశవ్యాప్తంగా నెలకొన్న ప్రతిపక్ష పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, మేధావులు,సామాజిక కార్యకర్తలు యావత్ దేశ ప్రజానీకం దేశ వ్యాప్తంగా విద్య వైద్యాన్ని ప్రైవేటుకు అందుబాటులో ఉంచకుండా, ప్రభుత్వం చేపట్టే ట్టేటట్లు ఒత్తిడి తెచ్చి విజయం సాధిస్తే సామాన్య ప్రజలకు దానికి మించిన విజయం మరొకటి ఉండదు.
విద్య ,వైద్యం ఎవ్వరి అనుసంధానంలో నడుస్తున్నది.. దానిపై వ్యాపారం ఎలా కొనసాగిస్తున్నారు, ఎలాంటి లాభాలను పొందుతున్నారు.. అన్న విషయం ప్రభుత్వంతో పాటు ప్రతిఒక్కరికి తెలిసిందే… కానీ ఆ దిశగా అడుగులు వేయలేని పరిస్థితి, ఇప్పటికైనా దేశ శ్రేయస్సు కాంక్షించే ప్రతి ఒక్కరు ఒక్కటై, విద్యా విషయాన్ని జాతీయ ఫరం చేస్తే ఎందరికో మేలు జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు ఈ విషయంపై దృష్టి కేంద్రీకరించి అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుటకు ప్రణాళికాయుతంగా ప్రవర్తిస్తూ, అమలుపరిస్తే అదియే నిజమైన పేదల పక్షాన నిలిచే నిజమైన ప్రభుత్వ మౌతుంది కావున ఆ దిశగా అడుగులు పడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
   గ్రామాలలోనున్న ఆర్.ఎం.పి దావకానల నుండి మొదలు కుంటే పట్నం దావకానల వరకు ప్రభుత్వ ,ప్రైవేటు అనే తారతమ్యం లేకుండా కిక్కిరిసి పోతున్నాయి అంటే ప్రజలు ఎందుకు ఇంతగా అనారోగ్యం పాలు కావస్తుందో శాస్త్రీయంగా పరిశోధన కావించి, అసలైన నిజాన్ని గ్రహించి, దానికనుగుణంగా తగ్గుదలకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అలాగే కార్పొరేట్ ఆస్పత్రుల్లో నెలకొన్న మెడికల్ షాప్ లపై రహస్యంగా పరిశోధించి, వారి నిలువుదోపిడిని అరికట్టడానికి ప్రయత్నాలు కొనసాగాల్సిన ఆవశ్యకత సైతం ఎంతైనా ఉన్నది.
    యావత్ దేశ ప్రజలందరూ ఒక్కత్రాటిపైకి వచ్చి, విద్య,  వైద్యం ప్రైవేటు నుండి జాతీయం చేయడానికి పూనుకొని ప్రణాళిక యుతంగా అమలుపరిచే కార్యాచరణను ఏర్పాటు చేసుకొని ఆదిశగా అడుగులు పడాలని మరియు దేశంలో రాష్ట్రంలో ఏర్పడే ప్రభుత్వాలు ఈ విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి .వాటిని జాతీయం చేయడానికి పూనుకునే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ,సామాన్యుడిపై అధిక భారం తగ్గి అందరికీ సమానత్వం అందుబాటులోకి రావాలని ఆశిద్దాం. I
                   డా. పోలం సైదులు ముదిరాజ్,
                           9441930361.

Other News

Comments are closed.