నేడు కాంగ్రెస్‌లో చేరనున్న రేవంత్‌రెడ్డి

ఢిల్లీ ఎఐసిసి వేదికగా రాహుల్‌ సమక్షంలో చేరికకు రంగం సిద్దం

భారీగా తరలనున్న రేవంత్‌ అనుచరులు

హైదరాబాద్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): టిడిపిని వీడిన రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. దిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వేదికగా మంగళవారం కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో రేవంత్‌ ఆ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో రేవంత్‌తోపాటు ఆయన అనుచరులు కూడా కాంగ్రెస్‌లో చేరనున్నారు. కార్యక్రమం లో పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా, తెలంగాణకు చెందిన కాంగ్రెస్‌ నేతలు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, జానారెడ్డి తదితరులు పాల్గొననున్నారు. దీనికోసం రేవంత్రెడ్డి ప్రభృతులు ఉదయం ఢిల్లీకి చేరు కుంటారు. దీనిని కాంగ్రెస్‌ పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేస్తోంది. రేవంత్‌రెడ్డి ఇటీవలే టిడిపికి, ఆ పార్టీ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. శాసనసభ సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా సమర్పించారు. అనంతరం ఆయన తన అనుచరులు, కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్న రేవంత్‌ రెడ్డి టిఆర్‌ఎస్‌ లక్ష్యంగా ఇక తన కార్యక్షేత్ర కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఇకపోతే టిడిపికి చెందిన భారీ సంఖ్యలో నేతలు, కార్యకర్తలు ఆయన వెంట వెళ్లనున్నారని తెలుస్తోంది. దాదాపు అన్ని జిల్లాల నుంచి కీలక నేతలుగా ముద్రపడినవారిలో అధికులు రేవంత్‌ వెంట నడవబోతున్నట్లు తెలిసింది. వీరందరి కోసం ఇప్పటికే ఢిల్లీ కర్ణాటక భవన్‌లో గదులు బుక్‌ చేసినట్లు సమాచారం. రేవంత్‌రెడ్డితో కలిసి కాంగ్రెస్‌లో చేరబోతున్న నాయకులు వీరేనంటూ సోషల్‌ విూడియాలో ఓ జాబితా వైరల్‌ అయింది. ఆ జాబితాలోని వారిలో వేం నరేందర్‌ రెడ్డి ఒక్కరే బాహాటంగా రేవంత్‌కు మద్దతు పలికి, టీడీపీకి రాజీనామా చేశారు. మిగిలినవారంతా రేపు నేరుగా పార్టీ మారబోతున్నట్లు సమాచారం. రేవంత్‌ వెంట వెళ్లబోయేవారిగా ప్రచారంలో ఉన్న జాబితాలో .. మాజీ మంత్రులు మొదలుకొని మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, మొన్నటి ఎన్నికల్లో అభ్యర్థులు, మాజీ కార్పొరేటర్లు, విద్యార్థి సంఘం నేతల వరకు ఉన్నారు. వీరిలో చాలా మంది పాపులర్‌ నేతలేకాక, కష్టకాలంలో పార్టీని అంటిపెట్టుకుని ఉన్నవారే కావడం గమనార్హం. వారంతా ఇప్పుడు కాంగ్రెస్‌లోకి చేరుతుండటం టీడీపీకి చావుదెబ్బే అన్న భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మిగిలిన ముఖ్యనేతలు కూడా అతిత్వరలోనే ప్రత్యామ్నాయ వేదికలు చూసుకో బోతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీకి, అలాగే తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసేసిన రేవంత్‌ రెడ్డి.. తన కొడంగల్‌ నియోజకవర్గంలో రాగల ఉప ఎన్నికలకు ఇప్పటినుంచే సిద్ధం అవుతున్నారు. రేవంత్‌ రెడ్డికి కాంగ్రెస్‌ పార్టీ దన్నుగా ఉందని, ప్రాధాన్యం ఇస్తోందని ప్రజలకు సంకేతం ఇవ్వడానికి రాహుల్‌ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు రేవంత్‌ తన సొంత నియోజకవర్గంలో ప్రజాభిమానాన్ని ఉప ఎన్నికల్లో కూడా తిరిగి చూరగొనగలిగితే.. అది ఆయనకు ప్రయోజనం చేకూర్చ నుంది. ఇందులో భాగంగా వచ్చేనెల 9వ తేదీన రాహుల్‌ మహబూబ్‌ నగర్‌ లో గిరిజన గర్జన సభ నిర్వహించబోతున్నారు. రేవంత్‌ రాజీనామా నేపథ్యంలో కొడంగల్‌ లో రాగల ఉప ఎన్నికలకు ఈ పాలమూరు సభ అప్రకటిత ప్రచార సభ అయినా ఆశ్చర్యంలేదు. కాంగ్రెస్‌ పార్టీ ఎప్పటినుంచో రాహుల్‌ ను రాష్టాన్రికి తీసుకురావాలనే ఉద్దేశంతో దీనిని పఎ/-లాన్‌ చేస్తోంది. దీనిని వరంగల్‌ లో నిర్వహించాలని మొన్నటిదాకా అనుకున్నారు. అయితే రేవంత్‌ చేరిక నేపథ్యంలో దీనిని మహబూబ్‌ నగర్‌ కు మార్చాలని రాహుల్‌ స్వయంగా సూచించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇదిలావుంటే తెలుగుదేశం పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రేవంత్‌ రెడ్డి ఈ నెల 31న కాంగ్రెస్‌ పార్టీలో చేరే అవకాశం ఉందని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి కుంతియా వెల్లడించారు. హైదరాబాద్‌లోని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డితో పాటు ఇతర నాయకులతో సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా రేవంత్‌ రెడ్డి చేరిక అంశంపై చర్చించినట్లు సమాచారం. వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన నేతలు.. రేవంత్‌ రాకపై ప్రకటన చేశారు. ఆయన రాకను కాంగ్రెస్‌ పార్టీలో ఎవరూ వ్యతిరేకించడం లేదని కుంతియా స్పష్టంచేశారు. పార్టీలో ఉన్నత పదవి ఇస్తామని ఎలాంటి హావిూ ఇవ్వలేదని తెలిపారు.