న్యాయనికి జరిగిన అన్యాయం
త్రిసూర్ (కేరళ) : తోటి ప్రయాణికురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తింస్తున్న వారిని అడ్డుకున్నందుకు ఓ యువకుడిని కదులుతున్న రైలు నుంచి కిందకు తోసేశారు. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. తిరువనంతపురం నుంచి మంగళూరు వెళుతున్న మలబార్ ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కేరళలోని చెరుతుర్తి వద్ద రైలు పట్టాలపై అపస్మారక స్థితిలో పడి ఉన్న బాధితుడ్ని బుధవారం ఉదయం స్ధానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. అనంతరం ఆయన్ను మరింత మెరుగైన చికిత్స కోసం త్రిశూల్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బాలగోపాల్ తెలిపారు.
బాధితుడి రెండు చేతులూ తొలగించాల్సి వచ్చిందని, ఆయన తలకి చిన్న చిన్న గాయాలయ్యాయని వెల్లడించారు. మంగళవారం రాత్రి స్పృహలోని వచ్చిన బాధితుడు.. జరిగిన వివరాలను పోలీసులకు వివరించారు. ”నేను మంగళూరులోని కొల్లూర్ మూకాంబికా ఆలయానికి వెళ్లడం కోసం అలువ స్టేషన్‌లో రెలైక్కాను.మద్యం తాగి ఉన్న నలుగురు వ్యక్తులు జనరల్ కంపార్ట్‌మెంట్‌లోని ఓ ప్రయాణికురాలిని లైంగికంగా వేధిస్తుండటంతో వారించాను. దాంతో వారు వెళ్లిపోయి, తిరిగి కొంతసేపటి తర్వాత వచ్చి నన్ను బాగా కొట్టారు. తర్వాత కదులుతున్న రైల్లో నుంచి కిందకు తోసేశారు” అని తెలిపారు. దీంతో గుర్తుతెలియని నలుగురు వ్యక్తులపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.


