న్యాయవాదులపై విచారణ జీవోను

బేషరతుగా నిలిపివేయాలి : కోదండరామ్‌
కోదాడ, డిసెంబర్‌ 16 (జనంసాక్షి) :
తెలంగాణ కోసం ఉద్యమించిన న్యాయవాదులపై విచారణ చేపట్టాలని విడుదల చేసిన జీవోను తక్షణమే ఉపసంహరించుకోవాలని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరాం, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య డిమాండ్‌ చేశారు. ఆదివారం నల్గొండ జిల్లా కోదాడలో నిర్వహించిన తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా మూడో మహా సభలకు హాజరై మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్న న్యాయవాదులపై ప్రభుత్వం కుట్ర పన్నిందని మండిపడ్డారు. 24 మందిని విచారించాలని జీవో జారీ చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. తెలంగాణ వాదులపై కేసులు ఎత్తివేస్తామని హామీని అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరం విస్మరించారని తెలిపారు. న్యాయవాదులపై విచారణ చేపడితే తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని కోరారు. విమలక్క అరెస్ట్‌కు నిరసనగా విడుతలు వారిగా ఉద్యమిస్తామని, ఇందుకోసం ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తామన్నారు.