పాత్రికేయులకు సాహసం, పరిశీలన అవసరం

సీనియర్‌ సంపాదకుడు కె. రామచంద్రమూర్తి
శ్రీ రాయుడి కృషి ఆదర్శప్రాయం శ్రీ ‘అది అంతే’ ఆవిష్కరణ సభలో వక్తలు
హైదరాబాద్‌, జూలై 29 (జనంసాక్షి) : పాత్రికేయులకు సునిశిత పరిశీలన దృష్టితో పాటు సాహసం కూడా ఎంతో అవసరమని సుప్రసిద్ధ జర్నలిస్టు హెచ్‌ఎం టీవీ సీఈఓ కె. రామచంద్రమూర్తి అన్నారు. జర్నలిస్టులకు లో చూపుతోపాటు ప్రజా ప్రయోజనాలకు కట్టుబడి పనిచేసే తత్వం ఉండాలన్నారు. జర్నలిజాన్ని ఒక ఉద్యోగంలా కాక, సామాజిక బాధ్యతతో కూడిన వృత్తిగా భావించి ప్రజా సమస్యలపట్ల స్పందించగలిగిన నాడు బోగాధి వెంకటరాయుడు లాగా ఉత్తమ జర్నలిస్టుగా రాణించగలరని ఆయన అన్నారు. సీనియర్‌ పాత్రికేయుడు భోగాది రాయుడు రాసిన సంచలనాత్మక పరిశోధనాత్మక కథనాల సంకలన పంపుటిని ఆయన ఆవిష్కరించారు. బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవన్‌లో ఆదివారం నాడు జరిగిన ఈ పుస్తక ఆవిష్కరణ సభకు ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు డి. సోమసుందర్‌ అధ్యక్షత వహించారు. ‘అది అంతే’ పేరిట రూపొందించిన ఈ పుస్తకాన్ని రామచంద్రమూర్తి ఆవిష్కరించి తొలి ప్రతిని అనపర్తి ఎమ్మెల్యే ఆదిత్య విద్యా సంస్థల యజమాని నల్లిమిల్లి శేషారెడ్డికి అందించారు. అనంతరం రామచంద్రమూర్తి ప్రసంగిస్తూ ఉదయం పత్రికా సమయం ఒక స్వర్ణయుగం వంటిదన్నారు. సాహసోపేత పరిశోధనాత్మకత కథనాలకు ఉదయం పత్రిక ఎంతో అవకాశం ఇచ్చిందన్నారు. ఆ సమయంలో భోగాది వెంకటరాయుడు లోతైన పరిశీలన, విశ్లేషణలతో ఎన్నో పరిశోధనాత్మక కథనాలు రాశారని అన్నారు. స్థానిక నుడికారాలు, సామెతలు సమర్థంగా ఉపయోగించుకుంటూ సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే రీతిలో భాషను వినియోగించుకుంటూ ఎన్నో ప్రజా సమస్యలను వెలికితీయగలిగారని చెప్పారు. అప్పట్లో రాయుడు చేసిన రాజకీయ విశ్లేషణలు నేటికీ వర్థిస్తాయని, అది ఆయనలోని పరిశీలనా దృష్టికి విశ్లేషణాపటిమకు నిదర్శనమని రామచంద్రమూర్తి ప్రసంశించారు.
విశాలాంధ్ర సంపాదకుడు, ఐజేయూ పూర్వ సెక్రటరీ జనరల్‌ కె. శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వంలో జరుగుతున్న వ్యవహారాలను ముందుగానే పసిగట్టి విశ్లేషణాత్మక కథనాలను అందించడంలో రాయుడు అందవేసిన చేయి అని అన్నారు. బడ్జెట్‌, తదితర ముఖ్యమైన విషయాలను ప్రజాప్రయోజనాల దృష్టితో ఆలోచించి కథనాలు అందించేవారన్నారు. ఒక దశలో రాయుడు అధికార రహస్యాలు వెల్లడిస్తున్నారన్న ఆరోపణలతో పోలీసుల నిర్బంధాన్ని కూడా ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. సహసోపేత కథనాలకు రాయుడు చిరునామాగా నిలుస్తారని కొనియాడారు. సభ అధ్యక్షుడు డి. సోమసుందర్‌ మాట్లాడుతూ ప్రజా సమస్యలు వెలికి తీయడంలో రాయుడు దిట్ట అని అన్నారు. పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి, సంక్షేమానికి ఎంతో కృషి చేశారన్నారు. ముఖ్యంగా గ్రామీణ పాత్రికేయల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించారన్నారు. ఏపీయూడబ్ల్యూజే తొలి సదస్సును ఏలూరులో నిర్వహించారని యూనియన్‌ అభివృద్ధిలో చురుకుగా పాల్గొంటూ కీలక పాత్ర పోషించారన్నారు. ఆనాడు రూపొందించిన ఏపీయూడబ్ల్యూజే లోగోతోనే నేటికీ సంస్థ పాత్రికేయ ఉద్యమంలో కొనసాగుతోందన్నారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై. నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ రాయుడుకు విస్తృతమైన వార్తా వనరులు ఉన్నాయని, ఏలాంటి సమాచారాన్నైనా నిమిషాల్లో సేకరించి సంచలనాత్మక కథనాలు రాశారని అన్నారు. ఆయన పాత్రికేయ జీవితం, ఒరవడి నేటి తరం జర్నలిస్టులకు ఆదర్శప్రాయమన్నారు. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి అసోసియేట్‌ ఎడిటర్‌ మూర్తి మాట్లాడుతూ రాయుడు ఎంతో అపారమైన అనుభవం కలిగిన పాత్రికేయుడని, ఏ క్షణంలో ఎలాంటి సమాచారమైనా రెడీ రెఫరెన్స్‌గా సహచరులకు అందించగల అనుభవశాలి అని, తన లాంటి వారికి గురువు అని అన్నారు. ముఖ్యంగా ఎడిటర్‌ కె. రామచంద్రమూర్తి తనకు అందించిన ప్రోత్సహానికి ఆయనకు ఎంతో రుణ పడి ఉంటానని అన్నారు. సమష్టి కృషితోనే తాను ఇంతటి విజయాన్ని,అభిమానాన్ని పొందగలిగానన్నారు.