పాస్‌బక్ సమస్య పరిష్కారమయ్యేనా…?
అనంతపురం, నవంబర్21 ఓ బాలిక తన తాత సమస్య పరిష్కారం కోసం రెవెన్యూ భవన్ మెట్లెక్కి అధికారుల అలసత్వాన్ని ఎత్తిచూపింది. గతకొంతకాలంగా అధికారుల నిర్లక్ష్యానికి ఈ ఘటన నిదర్శనంగా నిలిచింది. మా తాతకు పట్టాదారు పాస్ పుస్తకం ఎందుకు ఇవ్వడంలేదని పదకొండేళ్ల బాలిక రజిత ఇటీవల గ్రీవెన్స్ సెల్‌లో ప్రశ్నించడంతో అధికారులు అవాక్కయ్యారు. అయితే ఆమె ఇచ్చిన ఆర్జీని పరిష్కరిస్తారా లేదా అని ఇప్పుడు అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. నాలుగు నెలలుగా మండల కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా మా తాత సమస్యను ఎవరూ పట్టించుకోవడంలేదంటూ విన్నవించింది. విూరైనా మా తాత సమస్యను పరిష్కరించాలని కోరింది. తనకల్లుమండలం సింగిరి వాండ్లపల్లి పసుపులేటి సుబ్బన్న స్వగ్రామం. అతని మనువరాలు రజిత కదిరిలోని ఓ ప్రైవేటు- స్కూల్‌లో ఆరోతరగతి చదువుతోంది. తన తాతను వెంటబెట్టుకొని గ్రీవెన్స్‌కు వచ్చి హౌసింగ్ పీడీ ప్రసాద్ వద్దకు వెళ్లింది. తన తాత ఎదుర్కొంటన్న సమస్యను పీడీకి సవివరంగా వివరించింది. బాలిక చెబుతున్నంత సేపు అధికారు ఆశ్చర్యంగా విన్నారు. తమది సింగిరవాండ్ల పల్లిఅని… తన తాత మా గ్రామానికి చెందిన గోవిందు అనే వ్యక్తి నుంచి పొలం కొన్నాడని చెప్పుకొచ్చింది. సర్వే నెంబర్ 772-1లోని 1.48 ఎకరాలకు సంబంధించి తమకు పట్టా ఇప్పించాలని నాలుగు నెలలుగా మండల కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఎవరూ
పట్టించుకోవడంలేదని పీడీ దృష్టికి తీసుకువచ్చింది. గ్రీవెన్స్ సెల్‌లోనూ ఇదివరకే పలు మార్లు తమ తాత అర్జీలు ఇచ్చారని చెప్పింది. సాధారణ ఫిర్యాదు తరహాలోనే స్వీకరించి రసీదు ఇచ్చి పంపారు. ఆ బాలిక తన తాత సమస్యను ఉన్నతాధికారులకు వివరించి నిలదీయడంపై గ్రీవెన్స్‌లోని పలువురు అధికారులు, ఫిర్యాదుదారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.



