పుల్వామా ఉగ్రదాడిని ముక్తకంఠంతో ఖండించిన అసెంబ్లీ

అమర జవానులకు సంతాపం
ఒక్కో జవాను కుటుంబానికి 25లక్షలు
అసెంబ్లీలో ప్రకటించిన సీఎం కేసీఆర్‌
హైదరాబాద్‌,ఫిబ్రవరి22(జ‌నంసాక్షి): పుల్వామ ఉగ్రదాడిలో అశువులు బాసిన 40మంది జవాన్లకు తెలంగాణ అసెంబ్లీ ఘనంగా నివాళులు అర్పించింది. అంతేకాకుండా అమర జవాన్ల కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ఉగ్రదాడిలో మరణించిన ఒక్కొక్క అమర జవాను కుటుంబానికి రూ.25 లక్షలు అందచేయనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం అసెంబ్లీలో ప్రకటన చేశారు.  శుక్రవారం ఉదయం తెలంగాణ బ్జడెట్‌ సమావేశాలు ప్రారంభం కాగానే సీఎం కేసీఆర్‌ పుల్వామా అమర జవాన్లకు సంతాపం తెలుపుతూ తీర్మానం ప్రవేశపెట్టారు.  ఉదయం 11.30 గంటలకు ఉభయ సభలు సమావేశం ప్రారంభమైంది. శాసనసభ ప్రారంభం కాగానే పుల్వామా అమరులకు సంతాపం తెలియజేస్తూ సీఎం కేసీఆర్‌ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. ఈ నెల 14వ తేదీన జరిగిన దాడి అత్యంత అమానుషమైనదన్నారు. సైనికుల విూద జరిగిన దాడిని సమస్త దేశంపై జరిగిన దాడిగా అందరూ భావిస్తున్నారని తెలిపారు. 40 మంది జవాన్లు మృతిచెందటం బాధాకరమన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరులైన జవానుల కుటుంబాలకు దేశం యావత్తు సాయంగా నిలవాలని పిలుపునిచ్చారు. జవాన్లపై ఉగ్రదాడి హేయమైన చర్య అని, ఈ దాడి సైనికుల విూద, వ్యక్తుల విూద జరిగినది కాదని సమస్త దేశంపై జరిగిన దాడిగా అందరూ భావిస్తున్నారన్నారు. ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు మృతి చెందటం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు అండగా ఉండటమే కాకుండా, తమవంతుగా ఆదుకుంటామని హావిూ ఇచ్చారు. మాటలు చెప్పకుండా వారికి అండగా ఉండేందుకు ఒక్కో కుటుంబానికి 25 లక్షలు ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. విపక్షనేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ పుల్వామా ఘటన దేశాన్ని కలచివేసే సంఘటన అన్నారు. నిఘా వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ఈ ఘటన నిరూపించిందన్నారు. సిఎల్పీ నేతగా తొలుతనే ఇలాంటి విషయంపై మాట్లాడి రావాల్సి వచ్చిందని భట్టి ఆవేదన చెందారు. అమరుల కుటుంబాలకు ప్రతి ఒక్కరం అండగా నిలవాలని అన్నారు. సభలో ఉగ్రదాడికి ముక్త ఖండించడం పట్ల భట్టి హర్షం వ్యక్తం చేశారు. అమరులైన ఒక్కో జవాన్‌ కుటుంబానికి రూ.25 లక్షలు ప్రకటించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కి ధన్యవాదాలు తెలిపారు. దేశంలో రోజూ ఎక్కడో ఓ చోట మన జవాన్ల విూద దాడి జరుగుతూనే ఉందని, ఉగ్రవాదులకు ధీటైన సమాధానం ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌  అన్నారు. అదేవిధంగా ఏఐఎంఎఐఎం ఎమ్మెల్యేల బలాల మాట్లాడుతూ..  పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నారన్నారు.  ఈ సమయంలోనే మనమంతా ఐక్యతను ప్రదర్శించాలన్నారు. దిగ్భాంతికర సంఘటనను సహించాల్సిన అవసరంలేదన్నారు. దేశంలోకి శక్తివంతమైన పేలుడు పదార్థాలు ఎలా వస్తున్నాయో నిఘాపెట్టాలన్నారు. ఇమ్రాన్‌ ఖాన్‌ పాకిస్థాన్‌లో కూర్చొని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడని, రాష్ట్ర ప్రభుత్వం మానవీయ కోణంలో జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించిందన్నారు.  అనంతరం స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సభ రెండు నిముషాలు మౌనం పాటిస్తుందని ప్రకటించారు.పుల్వామా దాడిలో అమరులైన సీఆర్పీఎఫ్‌ జవానుల మృతికి సంతాపం తెలియజేస్తూ శాసనసభ రెండు నిమిషాలు మౌనం పాటించింది.  సంతాప తీర్మానానికి ఆమోదం తెలిపిన అనంతరం స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి సమావేశాలను పది నిమిషాలు
వాయిదా వేశారు. అమరులకు నివాళి అనంతరం జీఎస్టీ చట్టానికి తీసుకువచ్చిన సవరణ బిల్లును ప్రతిపాదించారు.మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ అధ్యక్షతన శాసనమండలిలో సమావేశాలు మొదలయ్యాయి. ముందుగా పుల్వామా ఉగ్రదాడిని అసెంబ్లీ ఖండించింది. పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు సంతాపం ప్రకటించింది.

తాజావార్తలు