ప్రపంచ తెలుగు మహాసభలను బహిష్కరిద్దాం


– విరసం సభ్యుడు వరవరరావు
హైదరాబాద్‌, డిసెంబర్‌ 24 (జనంసాక్షి) :
ప్రపంచ తెలుగు మహాసభలను బహిష్కరిద్దామని విప్లవ రచయితల సంఘం సభ్యుడు వరవరరావు అన్నారు. హైరదాబాద్‌లో సోమవారం తెలుగు మహాసభలకు వ్యతిరేకంగా తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వరవరరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నవారందరూ మాట్లాడేది తెలుగేనని చెప్పే సీమాంధ్ర పెత్తందారులు తెలంగాణ యాసను, మాండలికాన్ని ఎంతో అవమానించారన్నారు. ప్రసార మాధ్యమాల్లో, సినిమాల్లో ప్రతినాయకులకు, జోకర్లకు మాత్రమే తెలంగాణ భాష వాడి ఇప్పుడు అందరిదీ ఒకే భాష అని చెప్పడం ఎంతవరకు సమంజసమన్నారు. మన యాసపై, జీవనవైనంపై పదే పదే దాడులకు పాల్పడిన సీమాంధ్రులు జరుపుకుంటున్న ప్రపంచ తెలుగు మహాసభలను తెలంగాణ ప్రాంతంలోని నాలుగున్నర కోట్ల మంది ప్రజలు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమం ఎగసి పడినపుడే సీమాంధ్రులకు తెలంగాణ వారు మాట్లాడేది తెలుగు అని గుర్తుకు వచ్చిందని అది ఇక్కడి ప్రజలపై ఉన్న అభిమానంతో కాదని హైదరాబాద్‌ను హస్తగతం చేసుకోవాలని మాత్రమేనని తేల్చిచెప్పారు. ర్యాలీలో జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు అల్లం నారాయణ, ప్రొఫెసర్‌ సూరేపల్లి సుజాత తదితరులు పాల్గొన్నారు.