ఫీజు రియెంబర్స్‌మెంట్‌పై సభలో వాడీవేడి చర్చ

– విపక్షాల వాకౌట్‌

– పకడ్బందీగా అమలు చేస్తున్నాం

– ఈటల

హైదరాబాద్‌,నవంబర్‌ 15,(జనంసాక్షి): రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం అమలుపై అసెంబ్లీలో వాడీవేడీ చర్చ జరిగింది. దీనిపై సుదీర్ఘంగా చర్చ సాగింది. ప్రభుత్వం పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఉద్ఘాటించారు. అయితే ఎక్కడా ఫీజులు చెల్లించకుపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విపక్ష సభ్యులు సభ దృష్టికి తెచ్చారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హావిూ రాలేదని ఆరోపిస్తూ కాంగ్రెస్‌,టిడిపి, బిజెపి, సిపిఎం పార్టీలు వాకౌట్‌ చేశాయి. అంతకు ముందు మంత్రి ఈటెల మాట్లాడుతూ ఈ పథకం ద్వారా విద్యార్థుల తల్లిదండ్రుల్లో భరోసా కల్పించిన మాట వాస్తవమని స్పష్టం చేశారు. శాసనసభలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై లఘు చర్చ సందర్భంగా.. మంత్రి ఈటల రాజేందర్‌ వివరణ ఇచ్చారు. కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో సంబంధం లేదని మంత్రి తేల్చిచెప్పారు. 2016-17లో రూ. 3,200 కోట్ల బకాయిలు ఉంటే రూ. 2,896 కోట్లు చెల్లించామని తెలిపారు. ఈ అకాడమిక్‌ ఇయర్‌లో ఇంకా విద్యార్థుల డాటా అప్‌లోడ్‌ కాలేదని చెప్పారు. అడ్మిషన్లలో తేడా దృష్ట్యా ఏ అకాడమిక్‌ ఇయర్‌ రీయింబర్స్‌మెంట్‌ ఆ ఇయర్‌లో చెల్లించడం కుదరదన్నారు మంత్రి. ఇంటర్‌ నుంచి పీజీ చదివే విద్యార్థులకు అత్యధికంగా మెస్‌ ఛార్జీలను పెంచామని మంత్రి గుర్తు చేశారు. కళాశాల అనుబంధ వసతి గృహ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ రూ. 900 నుంచి రూ. 1500లకు పెంచామని పేర్కొన్నారు. ఇంటర్‌ విద్యార్థులకు రూ. 520 నుంచి రూ. 750కు పెంచామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకే కాకుండా అగ్రవర్ణాలకు చెందిన పేద విద్యార్థులకు ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌లు ఇస్తున్నామని స్పష్టం చేశారు. ప్రైవేట్‌ కాలేజీలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నామని ప్రతిపక్షాలు అనడం సరికాదన్నారు. తెరాస పార్టీకి, కాలేజీలకు ఉద్యమ సమయంలో ఎంతో అవినాభావ సంబంధం ఉందన్నారు. కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య తగ్గించడానికి ఫీజు రీయింబర్స్‌ మెంట్‌తో సంబంధం లేదని తెలిపారు. విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేయవద్దని ప్రతిపక్ష పార్టీల నేతలకు ఈటల రాజేందర్‌ సూచించారు. హాస్టల్‌ విద్యార్థులకు సన్నబియ్యం పెడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌ విద్యను అందిస్తున్నామని తెలిపారు. కాంట్రాక్టర్ల వ్యవస్థకు కొత్త భాష్యం చెప్పిన వారు కాంగ్రెస్‌ వారని మంత్రి అన్నారు. కాంట్రాక్టర్లు చేజిక్కించుకున్న తర్వాత వందలవేల కోట్లతో ప్రభుత్వ ఖజానాను దోచుకున్న ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వాని మంత్రి ఈటెల విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం హయాంలోమహబూబ్‌నగర్‌లోని ప్రాజెక్టులతో పాటు ఇతర ప్రాంతాల్లోని ప్రాజెక్టులకు అనుకున్న సమయానికి పనిచేసి లక్షలాది ఎకరాలకు నీరందించే ఘనత తెరాస ప్రభుత్వానిదన్నారు. అయితే చర్చ సందర్బంగా బకాయిల విషయంలో ప్రభుత్వం సష్టమైన హావిూ ఇవ్వలేదని ఆరోపిస్తూ విపక్ష సభ్యులు వాకౌట్‌ చేశారు.