ఫీజు రీయింబర్స్‌మెంట్‌ దేశం చలువేనట !

బాబు ‘మహా ‘ధర్నా.. అరెస్ట్‌
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 4 (జనంసాక్షి): బీసీ విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఫీజులు చెల్లించాలంటూ టీడీపీ అనుబంధ విద్యార్థి సంఘం మంగళవారం నిర్వహించిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. ధర్నాలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని అరెస్టు చేసి వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నగరం, పరిసర ప్రాంతాల నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు, టీడీపీ నాయకులు హాజరయ్యారు. వీరిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. అంతకుముందు ధర్నా నుద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. సమాజంలో బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి టీడీపీ కట్టుబడి ఉందని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఉద్ఘాటించారు. వెనుకబడిన తరగతులు, మైనారిటీల అభివృద్ధికి టీడీపీ బాధ్యత వహిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. పేదరిక నిర్మూలనకు విద్యాభ్యాసం ఒక్కటే మార్గమని అన్నారు. ప్రతికుటుంబంలో ఒకరైనా విద్యావంతులు ఉంటే ఆ కుటంబం పేదరికం నుంచి బయటపడుతుందని, అందుకే విద్యాభివృద్ధికి తమ ప్రభుత్వ హయాంలో ఎంతో కృషి చేశామని చంద్రబాబు అన్నారు. బీసీ విద్యార్థులకు పూర్తి స్థాయిలో బోధనా రుసుము చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ తెలుగునాడు స్టూడెంట్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో మంగళవారం ఎల్బీనగర్‌ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబునాయుడు పాల్గొని ప్రసంగించారు. బీసీ విద్యార్థులతో పాటు ఆర్థికంగా వెనుకబడిన ప్రతి విద్యార్థికి ప్రభుత్వమే ఫీజులు చెల్లించేందుకు బాధ్యత వహించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రతి విద్యార్థికి చదువుకునే హక్కు ఉందని, డబ్బు లేదనే కారణంతో ఎవరూ విద్యకు దూరం కాకూడదని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులతో పాటు అగ్రవర్ణాలలోని వెనుకబడిన విద్యార్థులకు కూడా ప్రభుత్వమే ఫీజులు చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీయే అధికారంలోకి రాబోతున్నదని, అప్పుడు అన్ని వర్గాలలోని పేద విద్యార్థులకు ఫీజులు ప్రభుత్వమే చెల్లించేలా చర్యలు తీసుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. 2009 ఎన్నికలప్పుడు పేద విద్యార్థులందరికీ ఫీజు చెల్లిస్తామని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ నేడు వాటిని తుంగలో తొక్కి పలు ఆంక్షలను విధిస్తోందని ఆయన విమర్శించారు. ఇది ప్రభుత్వ చేతకాని తనానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రతివారూ చదువుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతి ఒక కిలోమీటర్‌కు ఒక ఎలిమెంటరీ పాఠశాల, ప్రతి మూడు కిలోమీటర్లకు అప్పర్‌ ప్రైమరీ పాఠశాల, ప్రతి 5 కిలోమీటర్లకు హైస్కూల్‌, ప్రతి మండల కేంద్రంలో జెడ్పీ పాఠశాల, ప్రతి జిల్లా కేంద్రంలో ఇంజినీరింగ్‌, వైద్య కళాశాలలను స్థాపించామని ఆయన చెప్పారు. తమ హయాంలో విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేశామన్నారు. పౌష్టికాహార లోపం లేకుండా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టాని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు తొలిసారిగా తమ హయాంలోనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రారంభించినట్టు ఆయన గుర్తు చేశారు. ఎస్టీ, ఎస్టీలకు ఇస్తున్న మాదిరిగానే బీసీలకు, అగ్రవర్ణాలలో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు కూడా ఫీజులు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. విద్యార్థుల న్యాయమైన హక్కుల పోరాటానికి టీడీపీ అండగా ఉంటుందన్నారు. విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్‌ చేసే వరకు టీడీపీ వారి తరఫున పోరాడుతుందని చంద్రబాబునాయుడు చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎస్సీ,ఎస్టీలకు కల్పించిన విధంగానే పేద బీసీ విద్యార్థులకు కూడా ఫీజు వెసులుబాటు కల్పిస్తామన్నారు. వెనుకబడిన వర్గాలను అభివృద్ధిలోకి తెచ్చేందుకు పలు వినూత్న పథకాలను ప్రవేశపెడతామన్నారు. స్థానిక సంస్థలలో కూడా 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. ప్రభుత్వ, నామినేటెడ్‌ పదవులలో కూడా పెద్ద ఎత్తున రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. కేవలం వంద సీట్లే కాదు, అవసరం, అవకాశాలను బట్టి మరిన్ని సీట్లను కేటాయిస్తామని చంద్రబాబు చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారతదేశంలో యువ శక్తి అధికంగా ఉందన్నారు. మానవ వనరులను అభివృద్ధి చేస్తే ప్రపంచాన్ని జెయించే శక్తి యువకులకు ఉందన్నారు. మన దేశంలో పేద పిల్లలు మట్టిలో మాణిక్యాలని, వారిని సానపట్టి విద్య వైపు నడిపిస్తే సమాజం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. ఈ ధర్నాలో టీడీపీ నాయకులు వర్ల రామయ్యతో పాటు అధిక సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు.