బ్యాంకులు ప్రజలకు మరింత చేరువ కావాలి

– గ్రావిూణ ప్రాంతాల్లో సేవలను విస్తరించాలి

– జీఎస్టీతో కొంత ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నాం

– బ్యాంకర్లసమావేశంలో మంత్రులు ఈటెల, పోచారం

హైదరాబాద్‌, అక్టోబర్‌26(జ‌నంసాక్షి): బ్యాంకులు ప్రజలకు మరింత చేరువ కావాలని, గ్రావిూణ ప్రాంతాల్లో

సేవలను విస్తృత పర్చేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ బ్యాంకర్లకు సూచించారు. గురువారం నగరంలోని గన్‌ఫౌండ్రీ ఎస్‌బీఐ బ్యాంక్‌ ఆడిటోరియంలో 16వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితోపాటు వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారథి, బ్యాంక్‌ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న జీఎస్టీ విధానంతో రాష్ట్రం కొంత ఆర్థికంగా నష్టాలపాలైందన్నారు. రాష్ట్రంలో 29శాతం అభివృద్ధి సాధించామన్నారు. పంటల బీమా ప్రీమియం చెల్లింపునకు వేరువేరు గడువులు ఉండటం ఇబ్బందిగా మారిందని ఈటెల తెలిపారు. బ్యాంకులు మారిన పరిస్థితులకు అనుగుణంగా పని చేయాలని ఈటెల కోరారు. గ్రావిూణ ప్రాంతాల్లో సౌకర్యాలు పెంచాలని, బ్యాంకులు ప్రజలకు అందుబాటులో ఉంటే రైతులకు, ప్రజలకు ఇబ్బందులు తగ్గుతాయన్నారు. ప్రతిదీ లాభ, నష్టాల కోణంలోనే చూడకుండా సహకరించాలని ఈటెల సూచించారు. మిషన్‌ భగీరథకు బ్యాంకర్ల సహకారం మరువలేనిదన్న ఈటెల వృద్ధి రేటులో తెలంగాణ ముందుదన్నారు. రైతుల ఆదాయం పెంచేందుకు అలుపెరుగకుండా ప్రభుత్వం కృషిచేస్తుందని, సాగునీటి రంగాన్ని మరింత పటిష్టం చేస్తున్నామన్నారు. అనేక పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నామన్న ఈటెల బ్యాంకర్లు రుణాలు ఇచ్చే విషయంలో వ్యాపార కోణంలో చూడొద్దని కోరారు. అనంతరం పోచారం మాట్లాడుతూ రుణాల రద్దుకు ప్రభుత్వం నిధులు కేటాయించినా బ్యాంకులు రైతుల ఖాతాల్లో జమచేయలేదన్నారు. 2017-18 ఏడాదిలో రూ. 21 వేల కోట్ల రుణాలు ఇవ్వాలని , రైతులపై దృష్టి సారించి రబీలోనైనా రుణాలు పెంచాలన్నారు. రైతులు రుణాలు తీసుకున్న బ్యాంకుల్లో రూ.17 వేల కోట్ల రుణాలు మంజూరు చేశామని తెలిపారు. రైతుల అంశంలో దేశంలో ఎక్కడా ఇలాంటి చర్యలు చేపట్టలేదని పోచారం తెలిపారు. కట్‌ అప్‌ డేట్‌ కంటే ముందే ప్రీమియం జమ చేసుకునేలా చూడాలని, రైతుల నుంచి వడ్డీ వసూలు చేస్తే తిరిగి ఇవ్వాలని మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి బ్యాంకర్లకు సూచించారు.