భారత న్యాయ వ్యవస్థను గౌరవిస్తాం కసబ్‌ ఉరిపై స్పందించిన పాక్‌

ఇస్లామాబాద్‌, నవంబర్‌ 21:కసబ్‌ ఉరితీతపై పాకిస్తాన్‌ ఆచితూచి స్పందించింది. భారత న్యాయ వ్యవస్థ నిర్ణయాన్ని గౌరవిస్తామని తెలిపింది. పాక్‌ సంతతికి చెందిన ఉగ్రవాది అజ్మల్‌ కసబ్‌ ఉరిశిక్ష విషయాన్ని భారత ప్రభుత్వం రాయబార కార్యాలయం ద్వారా పాక్‌కు లేఖ ద్వారా పంపించింది. అయితే, ఆ లేఖను తీసుకునేందుకు పాక్‌ నిరాకరించడంతో.. ఫాక్స్‌ ద్వారా సమాచారం అందించింది. దీనిపై స్పందించిన పాక్‌ భారత న్యాయ వ్యవస్థను గౌరవిస్తామని పేర్కొంది. ఇదిలా ఉంటే.. కసబ్‌ ఉరితీతకు సంబంధించి పాకిస్తాన్‌ విూడియా పెద్దగా స్పందించలేదు. ఉరి విషయానికి వెబ్‌ పత్రికలు అధిక ప్రాధాన్యం ఇవ్లేదు. పాకిస్తాన్‌ ప్రధాన వార్తా చానల్‌ జియో టీవీ తన వెబ్‌సైట్లో ‘ఇండియా హ్యాంగ్స్‌ ముంబై గన్‌మన్‌ అజ్మల్‌ కసబ్‌’ అని పేర్కొంది. కసబ్‌ను ఉరి తీసినట్లు భారతీయ విూడియా పేర్కొందని మరో పత్రిక డాన్‌.కామ్‌ తెలిపింది. ఇదిలా ఉంటే, అంతర్జాతీయ విూడియా సంస్థలు మాత్రం కసబ్‌ ఉరి వార్తను ప్రముఖంగా పేర్కొన్నారు. వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌, న్యాయర్క్‌ టైమ్స్‌, ఆల్‌జజీరా, వాషింగ్టన్‌ పోస్ట్‌, గార్డియన్‌, టెలిగ్రాఫ్‌ తదితర ప్రముఖ పత్రికలన్నీ కసబ్‌ ఉరితీతకు ప్రాధాన్యమిచ్చాయి.