మజ్లిస్ వైఖరి బాధాకరం : వీహెచ్
హైదరాబాద్ : మజ్లిస్ వైఖరి బాధాకరమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. సోమవారం ఎంఐఎం ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిచడంపై వ్యాఖ్యానిస్తూ పై విధంగా స్పందించారు. ముఖ్యమంత్రి ఎంఐఎంకు ఇచ్చిన విలువ కాంగ్రెస్ మంత్రులకు సైతం ఇవ్వలేదని అన్నారు. ఏడు సంవత్సరాలుగా ఎంఐఎంకు ఎంతో లాభం చేకూరినా ప్రస్తుతం ఎందుకు మద్దతు ఉపసంహరించుకుందో అర్థం కావడం లేదన్నారు. ఎంఐఎం ఆలోచనలు కొద్దిరోజుల్లో తెలుస్తాయని చెప్పారు. సీజన్ బట్టి స్నేహితులు మారుతుంటారని పేర్కొన్నారు. జేఏసీ చైర్మన్ కోదండరామ్ మంత్రి గీతారెడ్డిని విమర్శించడం సరికాదన్నారు. టీ కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణ కోసం అల్టిమేటం ఇస్తారనుకోనని తెలిపారు. తాజా పరిణామాలపై అధిష్టానం ఎప్పటికప్పుడు సమాలోచనలు చేస్తుందని చెప్పారు. ఈ విషయంపై కేంద్రమే ఓ నిర్ణయం తీసుకుంటుందని వ్యాఖ్యానించారు.



