మనగుడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి : మంత్రి ధర్మాన

శ్రీకాకుళం, జూలై 31: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మనగుడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. ఆగస్టు 2వ తేదీ నుంచి ప్రారంభంకానున్న మనగుడి కార్యక్రమం పోస్టర్లను మంగళవారం ఉదయం పెదపాడులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర దేవాదాయ శాఖ, తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్తంగా మనగుడి కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని చెప్పారు. జిల్లాలో 375 దేవాలయాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుటకు సమాయాత్తం చేసారని అన్నారు. మనగుడి కార్యక్రమం శ్రావణ పౌర్ణమినాడు జరుపడం జరుగుతుందని చెప్పారు. ఆ రోజున హిందూ సాంప్రదాయ పద్దతిన పూజలు, రక్షాబందన్‌ కార్యక్రమం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం పంచుకొని అందరినీ అవగాహన కలిగించాలని ఆయన కోరారు. మనగుడి మానవతా వికాస కేంద్రమని ఆయన పేర్కొన్నారు. మనగుడి కార్యక్రమంలో హైందవ సాంప్రదాయ పద్దతిలో అనేక కార్యక్రమాలు తితిదే, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతాయని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో టిటిడి మనగుడి జిల్లా సమన్వయకర్త బాలరాజు, టిటిడి జిల్లా ఇన్‌ఛార్జి సత్యనారాయణ, హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ ట్రస్టు జిల్లా సమన్వయకర్త ఎస్‌.జోగినాయుడు తదితరులు పాల్గొన్నారు.