మాటలు కాదు చేతలు కావాలి
– అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యుడు జీవన్‌రెడ్డి
హైదరాబాద్, నవంబర్7(జనంసాక్షి): ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను విడనాడాలని కాంగ్రెస్ సభ్యుడు జీవన్‌రెడ్డి శాసనసభలో అన్నారు. రైతులను మాటలతో కాకుండా చేతల్లో ఆదుకోవాలన్నారు. ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు బేడీలు వేసిన ఘటన చరిత్రలో ఎక్కడా లేదన్నారు. నాణ్యత నెపంతో మద్దతు ధరకు కోత విధించడం సరికాదని సూచించారు. అకాల వర్షాలతో వ్యవసాయ ఉత్పత్తులు దెబ్బతిన్న కారణంగా వరి, పత్తి, మొక్కజొన్న పంటలకు రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు.
త్తికి రూ.వెయ్యి బోనస్ ఇవ్వాలి- డీకే అరుణ
రాష్ట్రంలో పత్తి రైతులు తీవ్ర ఆందోళన, ఆవేదనలో ఉన్నారని కాంగ్రెస్ సభ్యురాలు డీకే అరుణ అన్నారు. గతేడాది రాష్ట్రంలో పెద్దఎత్తున పత్తి పంట పండిందని, అందుకే ఈ ఏడాది కూడా ఎక్కువ మంది రైతులు పత్తి సాగుచేశారని తెలిపారు. అయితే అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం అండగా ఉండాలన్నారు. పత్తి పంటకు కేంద్రం రూ.500, రాష్ట్రం రూ.500 కలిసి రూ.వెయ్యి బోనస్ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.



