రాష్ట్రంలో సర్వేచేస్తున్న రాహుల్‌ బృందం

హైదరాబాద్‌: 2014 ఎన్నికలకు గెలుపుగుర్రాల ఎంపిక, స్థానిక పరిస్థితుల అధ్యయనంకోసం దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న రాహుల్‌గాంధీ బృందం శనివారం హైదరాబాద్‌లో హల్‌చల్‌ చేసింది. రాహుల్‌ అనుచరులు విశ్వజిత్‌ రాణే, జితేంద్రదె శ్‌ ప్రభు నేతృత్వంలోని ప్రతినిధిబృందం గాంధీభవన్‌కు వెళ్ళింది. రాయలసీమలోని 11 పార్లమెంట్‌స్థానాలలో అభ్యర్థుల ఖరారుకోసం ఆ ప్రాంతానికి చెందిన పలువురు నాయకులతో రాహుల్‌ అనుచరలు విడివిడిగా భేటీ అయ్యారు. మంత్రులు శైలజానాధ్‌ టీజీ వెంకటేష్‌, మాజీ మంత్రి దివాకర్‌రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలనుంచి అభిప్రాయాలు సేకరించారు. జగన్‌ ప్రభావం ఏమేరకు ఉంటుందనేదానిపై ఆరాతీశారు.

రాష్ట్రంలో పార్టీ పరిస్థితి బాగోలేదని రాహుల్‌ అనుచరులకు తాను చెప్పినట్లు దివాకర్‌రెడ్డి తెలియజేశారు. అయితే ప్రజలలో వ్యతిరేకత ప్రభుత్వం పైనే గానీ, పార్టీ పై కాదని, ఒకేసారి పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించొద్దని తాను సూచించినట్లు చెప్పారు. జగన్‌పై కేసులు ఎత్తేసి, ముఖ్యమంత్రిరి చేస్తే రాజీకి వస్తాడని చెప్పినట్లు తెలియజేశారు. కొత్తవారికి అవకాశం ఇవ్వాలని సూచించినట్లు చెప్పారు. మరోవైపు, ఇటీవల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై కమలాపురం ఎమ్మెల్యే వీరశివారెడ్డి రాహుల్‌ బృందానికి ఫిర్యాదు చేశారు.