రాష్ట్రం ముందుకొస్తే వసతి గృహాల నిర్మాణానికి కేంద్రం సిద్ధం

హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వం తన వంతు ఆర్థిక సహాయం అందిస్తే, ప్రతి మండలంలోనూ ఎస్సీ, బీసీ గృహాల
నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు అందించడానికి సిద్ధంగా ఉందని కేంద్ర సామాజిక న్యాయం శాఖ సహాయ మంత్రి బలరాం నాయక్‌ అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం పీజీ న్యాయ కళాశాలలో కొత్తగా ఏర్పాటు చేసిన గ్రంథాలయ భవనం, అంబేద్కర్‌ విగ్రహాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ, ఎస్సీ వసతి గృహాల నిర్మాణానికి అవసరమైన మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఫండ్‌ యాభై శాతం రాష్ట్రం చెల్లింస్తేనే కేంద్రం నిధులు విడుదల చేసే అవకాశం ఉందన్నారు. ఇందుకు రాష్ట్రం తగిన కసరత్తు చేయాలన్నారు. అంబేద్కర్‌ ట్రస్ట్‌ ద్వారా ఎస్సీ బాలికల వసతి గృహాల నిర్మాణానికి నిధుల మంజూరుకు తాను ప్రయత్నింస్తున్నానని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అనుకూలమైన నిర్ణయం తీసుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే సోనియా ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తాను కట్టుబడి ఉంటానని ఆయన తెలిపారు.