రైతులందరికీ వృత్తిపరికరాలు పంపిణీ చేయాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 9 : ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న  రైతు మేళాలో రైతులకు వృత్తిపరికరాల పంపిణికీ రూ. 14.89 లక్షలు మంజూరు చేశారని, అయితే ఈ నిధులతో పెద్ద రైతులకే లాభం జరుగుతుందని, తెలుగు రైతు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మహీపాల్‌ ఆరోపించారు. సన్నకారు, చిన్నకారు రైతులకు కూడా మేలు జరిగే విధంగా వ్యవసాయ పనిముట్లను అందించాలని ఆయన కోరారు. జనవరి మొదటి వారంలో పసుపు రైతుల పంట చేతికి అందుతుందని అప్పటి లోగా పసుపు రైతులకు కావాల్సిన  యంత్రాలు, పనిముట్లు అందించాలని ఆదివారం నాడు టిడిపి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తెలిపారు. సన్నకారు, చిన్నకారు రైతులకు ఇచ్చే పనిముట్లలో సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలో రైతులు అనేక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే జిల్లా సమీక్షా సమావేశాలను నిర్వహించాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో టిడిపి జిల్లా అధికార ప్రతినిధి నరేందర్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.