లారీని ఢీకొట్టిన టీఎస్‌ఆర్టీసీ బస్సు.. ఇద్దరు మృతి

ప్రకాశం: గుడ్లూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  మోచర్ల వద్ద టీఎస్‌ఆర్టీసీ బస్సు లారీని ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్‌ అక్కడికక్కడే మృతిచెందగా, మరో మహిళ ఆస్పత్రిలో మరణించారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను కావలి ఏరియా ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం నెల్లూరు హాస్పటల్‌కు తరలించారు.ఆర్టీసీ బస్సు మిర్యాలగూడ నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. పొగమంచు కారణంగా రహదారి కనిపించకపోవడంతోనే యాక్సిడెంట్‌ జరిగినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.