వరుస దొంగతనాలతో ప్రజల బెంబేలు నగరంలో పెరిగిన చోరీలు
చోద్యం చూస్తున్న అధికారులు
పోలీసులు పనితీరుపై విమర్శలు
హైదరబాద్, నవంబర్22: నగరవాసులను దొంగలు బెంబేలెత్తిస్తున్నారు. కంటికి కునుకులేకుండా చేస్తున్నారు. బయటకు పోయి వచ్చఏలోపు ఏం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ వరుస దొంగతనాలను అరికట్టడంలో అధికారులు విఫలమవుతన్నారన్నారోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవలికాలంలో చిలకలగూడలో జరిగిన వరుస దొంగతనాలను మరువకముందే బధవారం మరోసారి చిలకలగూడలో చోరీ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో 50 తులాల బంగారం, ఆరు వేల రూపాయల నగదు అపహరణకు గురైంది. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. చిలకలగూడలోని గరోండ అపార్టుమెంట్‌లోని నాలుగో అంతస్తులో ఉంటున్న ఓ ఒంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితులు తెలిపిర వివరాల ప్రకారం… ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లారు. గురువారం ఉదయం ఆ ఇంటికి తాళాలు పగులగొట్టి ఉండడంతో పక్కింటివారు బాధితులకు ఫొన్ ద్వారా సమాచారం అందించారు. ఇంటి యజమాని ఇంటి లోపలికి వెళ్‌లి చూడడంతో ఈ భారీ చోరీ వెలుగుచూసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇటీవలే చిలకలగూడలో ఓ పెళ్లి ఇంట్లో చోరీ జరుగగా 20 తులాల బంగారం అపహరణకు గురైంది. అంతకుముందే ఇదే ప్రాంతంలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఈ వరుస ఘటనలతో ప్రజలు జంకుతున్నారు. ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అయితే ఈ దొంగతనాలను అరికట్టడంలో పోలీసులు విఫలమవుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారంలో రెండు దొంగతనాలు భారీగా జరిగినా పోలీసులు వారిని పట్టుకోకపోవడంతో ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు మేల్కొని దొంగతనాలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.



