‘వైఎస్‌ ప్రేమంతా తెలంగాణ భూములపైనే’

హైదరాబాద్‌: ‘ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి తెలంగాణ ప్రజలపై ప్రేమ ఉండేదికాదు. ఆయనకున్న ప్రేమంతా తెలంగాణ భూములు, తెలంగాణ ప్రజల ఓట్లపైనే ‘ అని టీఆర్‌ఎస్‌ పొలిట్‌బ్యూరో సభ్యుడు నిరంజన్‌రెడ్డి అన్నారు. పోతిరెడ్డిపాడును మూసివేస్తమని ఆనాడు వైఎస్‌ నంద్యాల సభలో అనలేదా అని ఆయన ప్రశ్నించారు. దీనిపై వైఎస్‌ విజయలక్ష్మి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. అసలు జగన్‌ ఏంచేసి జైళ్లో ఉన్నాడో విజయలక్ష్మి ప్రజలకు చెప్పాలని నిలదీశారు. తెలంగాణ ప్రజలు సీమాంధ్ర రాజ్యం వద్దంటున్నరని, తెలంగాణ రాజ్యం కావాలని కోరుకుంటున్నారని వివరించారు. పార్లమెంట్‌లో ప్లకార్డులు ప్రదర్శించి వచ్చిన తెలంగాణను అడ్డుకున్నది జగన్‌ కాదా అని ప్రశ్నించారు.  తెలంగాణపై స్పష్టమైన వైఖరిని చెప్పినంకనే షర్మిల తెలంగాణలో అడుగు పెట్టాలని డిమాండ్‌ వ్యక్తం చేశారు. యోగివేమని యూనివర్సిటీకి ఇచ్చిన నిధుల్లో పది శాతం నిధులను కూడా తెలంగాణలోని  యూనివర్సిటీలకు ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు.