శరవేగంగా మిషన్ భగీరథ పనులు
– 49 నియోజకవర్గాల్లో మిషన్ భగీరథ ద్వారా మంచినీరు అందిస్తున్నాం
– 2017 చివరి నాటికి రాష్ట్రంలోని ఇంటింటికి అందిస్తాం
– అసెంబ్లీలో మంత్రి కేటీఆర్
హైదరాబాద్,నవంబర్1(జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మిషన్ భగీరథపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. 2017 చివరి నాటికి ఇంటింటికి మంచినీరు అందిస్తామని ఉద్ఘాటించారు. ఇప్పటికే 49 నియోజకవర్గాల్లో మిషన్ భగీరథ ద్వారా మంచినీరు అందుతుందని పేర్కొన్నారు. తప్పకుండా ఎన్నికలలోపే నీళ్లిచ్చి ఎన్నికలు వెళ్తామన్న హావిూ మేరకు పనులు జరుగుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని చెప్పారు. మిషన్ భగీరథ కోసం డిక్రింగ్ వాటర్ కార్పోరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీని కోసం రిక్రూట్‌మెంట్ కూడా చేశామని తెలిపారు. ఇంట్రా విలేజ్ పైపులైన్స్‌ను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలకు మంచినీటిని అందిస్తామని చెప్పారు. క్లోరైడ్‌తో అతలాకుతలమైన ప్రాంతాలకు తప్పకుండా మంచినీటిని అందించి సమస్యను తీరుస్తామని స్పష్టం చేశారు. అవసరమున్న చోట కొత్త పైపులైన్లు వేస్తామని మంత్రి హావిూనిచ్చారు.
లాజిస్టిక్ హబ్‌గా హైదరాబాద్..
దేశంలోనే హైదరాబాద్‌ను లాజిస్టిక్ హబ్‌గా మారుస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 12 ప్రాంతాల్లో లాజిస్టిక్ పార్క్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. వస్తు రవాణా రంగాన్ని ప్రోత్సహించేందుకు లాజిస్టిక్ పార్క్‌లు ఉపయోగపడుతాయన్నారు. ఇప్పటికే రెండు చోట్ల పార్క్‌లు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఈ పార్కుల్లో స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు.



