శీర్షిక : విజయభేరీ

 తప్పు ఉన్నా లేకున్నా మొన్న
తలవంచింది , నిన్న తప్పక తలదించింది .
నేడు తలదన్నే నిర్ణయాధికారాన్ని చేజిక్కించుకునే ప్రయత్నంలో తల మునకలవుతోంది.
 అయినా ఇంకా ఏదో తడబాటు,
 ఆంక్షల వలయంలో నుండి బయటపడ్డా
వాటి సరిహద్దులు తెలుసుకోవడంలో ఎక్కడో చిన్న పొరపాటు.
 సమానత్వ జెండా హిమాలయ శిఖరం పై రెపరెపలాడించి , అంతరిక్ష యానం చేసి వివక్షల ఊడలపై ఊరేగింపుగా వచ్చినా, ఉసురుమంటూ ఇంకా వాకిట్లో, వీధి గుమ్మాలకు ఆత్మాభిమానపు మాలలు  వేలాడుతూ,
 శతాబ్దాలుగా నడుస్తున్న సృష్టిలో దశాబ్దాలుగా  అస్తిత్వపు పునాదులను తవ్వుతూ తన ఉనికిని చూసే తానే ఉలిక్కిపడే పరిస్థితులు.
 డిగ్రీల మీద డిగ్రీలు విద్యార్హతను మాత్రమే పెంచుతూ, వాస్తవ జీవితాలు చదవలేని పలుచబడ్డ ఆలోచనా పరిధితో అనాలోచిత నిర్ణయాలనుండి బయటపడేందుకు,
చిక్కటి ఆలోచనలను  ఇంకా విస్తృతం చేయాలి .
ధిక్కారస్వరాన్ని పెంచి ఆత్మస్థైర్యపు కాగడా వెలిగించిన తాను ప్రేమ , మోసం అనే ఉచ్చులో బిగుసుకొని , అర్ధాంతంగా అర్థం లేని జీవితాన్ని మిగిల్చి కన్న వారిని జీవచ్చవాలను చేస్తూ, కడుపు మంటను రగిల్చే పరిస్థితులతో తలపడాలి.
 ఓటమి గెలుపులు ఉఛ్వాస, నిశ్వాస లైనా, మనోధైర్యం ,ఆత్మవిశ్వాసం,  అనే రెండు నేత్రాలతో సంపూర్ణ ఆయువుకు హారతినిచ్చి, ఆయువు అలసిపోయేంతవరకు బతికి చూపించి తనను తాను జయిస్తూ విజయభేరి మోగించాలి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ధీటుగా నిలబడే పర్వతాశిఖరంలా హృదయాంతరాల్లో
పాతుకుపోవాలి.