శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్త జనం

కార్తీక సోమవారంతో ప్రత్యేక పూజలు

హైదరాబాద్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): తెలుగు రాష్టాల్ల్రో రెండో కార్తీక సోమవారం సందర్భంగా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ముక్కంటికి ప్రత్యేకంగా పూజలు చేస్తున్నారు. కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. ప్రధాన శైవ క్షేత్రాలకు భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవైలం, వేములవాడ, కాళేవ్రం, పంచారామ క్షేత్రాలకు భక్తుల తాకిడి పెరిగింది. ఉదయం నుంచే భక్తులు దర్శనానికి క్యూ కట్టి, దీపాలు వెలించారు. విజయవాడ దుర్గాఘాట్‌ భక్తులతో కిటకిటలాడుతోంది. తెల్లవారుజామున మూడు గంటల నుంచి కృష్ణానదిలో భక్తులు పెద్ద సంఖ్యలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఘాట్‌లో కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. మరోవైపు పాతబస్తీలోని పాతశివాలయం, యనమలకుదురు రామలింగేశ్వరస్వామి ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. కార్తీకమాసం సోమవారం సందర్భంగా అమరావతి అమరేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. కోటప్పకొండ త్రికోటేశ్వర ఆలయం భక్తులతో రద్దీగా ఉంది. సూర్యలంక బీచ్‌లో భక్తుల స్నానాలు ఆచరిస్తున్నారు. భారీగా భక్తులు తరలిరావడంతో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు, పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. శ్రీశైల క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. వేకుమజాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలాచరించడానికి భక్తులు క్యూ కట్టారు. స్వామి, అమ్మవారి దర్శనానికి గంటలకొద్దీ సమయం పట్టింది. అందరికీ దర్శనాలు జరిగేలా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో కార్తీక సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచి క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. రాజనన్నను దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. కాగా నేడు స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు.దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం భోజన, వసతి ఏర్పాటు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. రాజరాజేశ్వరస్వామి దర్శనానికి 5 గంటల సమయం పట్టనుంది. భక్తులు స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయంలో ఆర్జిత సేవలను రద్దు చేశారు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధికి భక్తులు పోటెత్తారు.

అటు అన్నవరంలో సరైన ఏర్పాట్లు కల్పించకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. రత్నగిరి భక్తజనులతో కిటకిటలాడుతోంది. రత్నగిరిపై సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. గదులు లేకపోవడంతో పిల్లాపాపలతో ఆరుబయటే నిద్రించారు. ప్రతీ ఏడాది కార్తీకమాసంలో ముఖ్యంగా సోమవారం రోజుల్లో భారీగా భక్తులు తరలివస్తారని తెలిసినా అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్తీక సోమవారం దృష్ట్యా మహిళలు స్వామివారికి పూజలు చేశారు. దీపాలు వెలిగించారు.