సకాలంలో అందని వేరుశనగ విత్తనాలు

కడప,నవంబర్‌ 21(: రబీ సీజన్‌లో సాధారణంగా వరి కోత అనంతరం నీటి పారకం కింద వేరుశనగను సాగు చేస్తారు. జిల్లాలో ఇప్పటికే వరి కోతలు దాదాపుగా పూర్తి కావచ్చాయి. వేరుశనగ సాగు చేయాలనుకున్న రైతులకు ప్రభుత్వం సబ్సిడీతో అందించే కాయలు దక్కే పరిస్థితి కనిపించకపోవడంతో బయటి నుంచి రైతులే స్వయంగా సేకరించుకుంటున్నారు. 40 కిలోల బస్తాకు రూ. 2400 చెల్లించి రైతులు కాయలను తీసుకువస్తున్నారు. ప్రభుత్వం నాణ్య మైన కాయలను రైతులకు అందించి వుంటే 30 కిలోల బస్తా రూ.1300కే వచ్చి వుండేది. కానీ ఎక్కడ లోపం వుందో తెలియదు కానీ నాణ్యమైన కాయలను అందించడంలో ఏపీ సీడ్స్‌ పూర్తిగా విఫలమైంది.   సకాలంలో నాణ్య మైన విత్తన కాయలను రైతులకు అందించడంలో వ్యవసాయ శాఖ యంత్రాంగం సత్వర చర్యలు తీసు కోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం కరువు జిల్లాగా ప్రకటించిందే తప్ప పూర్తి స్థాయిలో రైతులను ఆదుకున్న దాఖలాలు లేవంటూ రైతు సంఘాల నేతలు అంటున్నారు. జిల్లాలో సాధారణంగా ఖరీఫ్‌లో వర్షాన్ని ఆధారంగా చేసు కుని లక్షా 24 వేల హెక్టార్లలో వేరు శనగ పంటను సాగు చేస్తున్నారు. ఈ పంట ద్వారా వచ్చిన ఉత్పత్తిని అమ్మి తిరిగి నవంబర్‌ నెలలో నీటి తడుల కింద సాగుచేసే వేరుశనగకు వినియో గిస్తుంటారు. కానీ గత ఖరీఫ్‌తో పాటు ఈ ఏడాది ఖరీఫ్‌లో కూడా జిల్లాలో వేరుశనగ దిగుబడులు పెద్దగా లేవు. దీంతో రబీ వేరుశనగకు విత్తనాలు సమస్యగా మారాయి. ప్రభుత్వం సర ఫరా చేయాలనుకున్న సబ్సిడీ కాయ లను రైతులు నాసిరకంగా వున్నాయంటూ తిరస్కరించారు. ఆ తర్వాత నాణ్యమైన కాయలను తెప్పిస్తున్నా మంటున్నారే తప్ప ఇంత వరకూ పంపిణీకి తగిన చర్యలు తీసుకున్న పరిస్థితులు కనిపించడం లేదు.