సద్దమణిగిన చెన్నూరు వివాదం
– సీఎం కేసీఆర్‌తో భేటీ అయిన అసంతృప్త నేత ఓదేలు
– తగిన ప్రాధాన్యతను ఇస్తానని హావిూ ఇచ్చిన కేసీఆర్
– కేసీఆర్‌మాటే తనకు శిరోధార్యం
– సుమన్ గెలుపుకు శాయశక్తులా కృషి చేస్తా
– విలేకరుల సమావేశంలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు
హైదరాబాద్, సెప్టెంబర్14(జనంసాక్షి) : మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం తెరాసలో నెలకొన్న వివాదం సద్దుమణిగింది. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తనకు కాకుండా టికెట్‌ను ఎంపీగా ఉన్న సుమన్‌కు కేటాయించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు నిరసనకు దిగారు. కాగా గురువారం సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పావులగంటకుపైగా సీఎం ఓదేలుతో చర్చలు జరిపారు. అనంతరం నల్లాల ఓదేలు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తనకు ఎలాంటి అన్యాయం జరగదని, రానున్నరోజుల్లో సముచిత స్థానం కల్పిస్తానని కేసీఆర్ భరోసా ఇచ్చారని అన్నారు. ఈ విషయాన్ని నియోజకవర్గ ప్రజలు పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 6నుంచి చెన్నూరు నియోజకవర్గంలో జరిగిన సంఘటనలు, వివిధ అంశాలపైన సీఎం కేసీఆర్ తనను గురువారం పిలిచి అన్ని విషయాలు మాట్లాడారని ఓదెలు వెల్లడించారు. సీఎం కేసీఆర్ మాట తనకు శిరోధార్యమని, ఆయన ఆదేశాలకు, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఓదెలు చెప్పారు. సీఎం కేసీఆర్‌తో కలిసి జీవిత కాలం కలిసి పని చేస్తానని ప్రకటించారు. చెన్నూరు నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ గెలుపు కోసం అందరం కలిసి పని చేద్దామని పార్టీ నాయకులు, కార్యకర్తలను కోరారు. తెలంగాణ ఉద్యమంలో మొక్కవోని దీక్షతో పనిచేశానని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తుచేశారని ఓదెలు చెప్పారు. 2001 నుంచి 2018 వరకు పార్టీపై, సీఎం కేసీఆర్, నాయకులపై అపారమైన నమ్మకంతో పనిచేసినందుకు ప్రశంసించారని వెల్లడించారు. 2009లో తన దగ్గర నామినేషన్ కు డబ్బులు లేకున్నా కోటీశ్వరుడిపై పోటీకి నిలబెట్టి సీఎం కేసీఆర్ బీ ఫాం ఇచ్చారని, నియోజక వర్గ ప్రజలను తనను గొప్పగా మూడుసార్లు గెలిపించారని ఓదెలు గుర్తుచేసుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి సీఎం కేసీఆర్ గొప్పగా చెప్పారని, తనకు, తన కార్యకర్తలకు ఎలాంటి నష్టం జరగకుండా సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారని ఓదెలు వెల్లడించారు. దానికి విూ అందరి అనుమతి, సహకారం కావాలని కార్యకర్తలను కోరారు.
గత కొద్దిరోజుల క్రితం చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ బాల్క సుమన్‌కు కేటాయించటంతో ఓదేలు వర్గం తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. తనకు టికెట్ కేటాయించే వరకు ఇంటి నుంచి బయటకు రానని ఓదేలు స్వీయగృహనిర్భదన చేసుకున్నారు. దీంతో సీఎం కేసీఆర్ తనను కవాల్సిందింగా ఓదేలుకు ఫోన్‌ద్వారా సూచించడంతో గురువారంసీఎంతో భేటీ అయ్యారు. ఇదే సమయంలో బాల్క సుమన్ ఎన్నికల ప్రచారం ప్రారంభం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఓదేలు అనుచరుడు గట్టయ్య పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన ఘటనలో 16 మంది గాయపడిన విషయం తెలిసిందే.



