సరిహద్దులో కొనసాగుతున్న ఉద్రిక్తత

పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో బస్సుసర్వీసులు నిలిపివేసిన పాక్‌
దేశ భద్రత విషయంలో రాజీపడం : ఆంటోని
న్యూఢిల్లీ, జనవరి 11 (జనంసాక్షి):
భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో శుక్రవారం తీవ్ర ఉద్రిక్త నెలకొంది. పొరుగు దేశం మరోమారు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. భారత సైన్యంపై నిరాటంకంగా కాల్పులకు తెగబడింది. నాలుగు రోజుల క్రితం ఇద్దరు భారత జవాన్లను అత్యంత పాశవికంగా ఊచకోత కోసిన పాక్‌ సైన్యం.. తాజాగా సరిహద్దులోని పలుచోట్ల భారత సైనికులపైకి కాల్పులు జరిపింది. దీంతో వెంటనే అప్రమత్తమైన మన జవాన్లు పాక్‌ సేనల కాల్పులను తిప్పికొట్టారు. సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొందని.. అయితే, పరిస్థితి అదుపులోనే ఉందని భారత సైన్యం శుక్రవారం ప్రకటించింది. పాక్‌ కవ్వింపు చర్యల నేపథ్యంలో 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే, నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ), సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత నేపథ్యంలో పాక్‌ పూంచ్‌-రావల్‌కోట్‌ మధ్య బస్సు సర్వీసులను నిలిపివేసింది. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయని దాయాది.. నియంత్రణ రేఖ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులపై రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ స్పందించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. దేశ భద్రతకు వచ్చిన ముప్పేవిూ లేదని ఆయన భరోసానిచ్చారు. శుక్రవారం న్యూఢిల్లీలో ఆంటోనీ విూడియాతో మాట్లాడుతూ.. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్‌ ఉల్లంఘించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. దేశ భద్రతకు భారత బలగాలు, సైన్యం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. సరిహద్దుల్లో పరిస్థితిని ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిశీలిస్తోందని చెప్పారు. జాతి భద్రత దృష్ట్యా ఏం చేయడానికైనా
సిద్ధమేనని స్పష్టం చేశారు. జమ్మూకాశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితిని నియంత్రించేందుకు అవసరమై బలగాలు సిద్ధంగా ఉన్నాయని, అవసరమైతే మరిన్ని బలగాలను మోహరిస్తామన్నారు. పాక్‌ కాల్పుల విరమణను ఉల్లంఘించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పారు. ఏడాది కాలంగా దేశంలోకి చొరబాట్లు పెరిగాయని ఆంటోనీ చెప్పారు.