సింగరేణి సమస్యలు పట్టవా

ఖమ్మం, డిసెంబర్‌ 29 (): సత్తుపల్లి ఓసి ఏర్పడి ఎనిమిదేళ్లు పూర్తయింది. వందల కొద్ది టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగింది. విస్తరణ కోసం కార్యాచరణ పూర్తయింది. ఆయా ప్రాంతాల నుండి సుమారు 300 కుటుంబాలు జేవిఆర్‌ ఓసికి బదిలీపై వచ్చారు. వాళ్లకు సౌకర్యాలు కల్పించడంలో యాజమాన్యం ఘోరంగా విఫలమవుతోంది. తమ డిమాండ్ల సాధన కోసం అనేక పర్యాయాలు దశలవారీ ఆందోళనలు జరిపారు. అయినా నెరవేరిన దాఖలాలు కనిపించలేదు. అసలే చిన్న పట్టణం నివాస గృహాలు దొరక్క చాలీచాలని గదుల్లో కుటుంబ సభ్యులతో తలదాచుకునే పరిస్థితి ఏర్పడింది. అద్దెలు కూడా ఆకాశాన్నంటి ఉన్నాయి. కటింగ్‌లు పోనూ వచ్చే జీతం కడుపునింపుకోవడానికి, ఇంటి అద్దెలకే సరిపోతుంది. ఈ పరిస్థితుల్లో క్వార్టర్స్‌ నిర్మిస్తామని యాజమాన్యం రెండేళ్ల నుంచి ఇస్తున్న హామీ కార్యరూపం దాల్చడం లేదు. ఈ నేపథ్యంలో గత్యంతరం లేక కార్మికులు జీవన సమరాన్ని సాగిస్తున్నారు. ప్రశ్నిస్తే వేటు తప్పదని తెలిసినప్పటికీ అప్పుడప్పుడు సాహసం చేస్తూనే ఉన్నాయని ఆయా ఉద్యోగ  సంఘనాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యా, వైద్య సౌకర్యాల మాట పక్కన పెడితే తక్షణ కర్తవ్యంగా గృహాలు కట్టించగలిగితే తలదాచుకునే అవకాశం ఉంటుందని మొరపెడుతున్నారు.