సీబీఐ అదనపు ఎస్పీ ఆర్‌.ఎం.ఖాన్‌ బదిలీ

హైదరాబాద్‌: ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ అక్రమాల కేసు దర్యాప్తు అధికారిగా వ్యవహరిస్తున్న సబీఐ అదనపు ఎస్పీ ఆర్‌.ఎం.ఖాన్‌ బదిలీ అయ్యారు. ముంబయి ఆర్థిక నేరాల విభాగానికి ఖాన్‌ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయన స్థానంలో చైన్నై సీబీఐ అదనపు ఎస్పీ అలెగ్జాండర్‌ను నియమించారు. సుమారు ఆరేళ్లుగా హైదరాబాద్‌లో పనిచేస్తున్నందున సుదీర్ఘకాలంగా ఉన్న వారి సాధారణ బదిలీల్లో భాగంగానే నిర్ణయం జరిగిందని సీబీఐ అధికారులు చెబుతున్నారు. అయితే ఓఎంసీ అక్రమాల కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నాందున ఖాన్‌ బదిలీ నిర్ణయం పునస్సమీక్షించాలని కోరాలని స్థానిక సీబీఐ ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ఆధునిక పరిజ్ఞానంతో కేసును దర్యాప్తు చేయడంతో పాటు గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్‌ కుంభకోణం వెలుగులోకి తేవడంలోనూ ఆయన ప్రధాన పాత్ర  పోషించారు. గతేడాది సీబీఐ ఉత్తమ దర్యాప్తు అధికారి అవార్డునూ పొందారు. గతంలో సత్యం కుంభకోణం దర్యాప్తులోనూ ఆయన కీలకంగా వ్యవహరించారు.